Nagababu

Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!

Nagababu: ములుగు జిల్లా మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్న చిరువ్యాపారి వలీ (Shaik Shah Vali) పట్ల కొందరు యూట్యూబర్లు ప్రవర్తించిన తీరుపై రాజకీయంగాను, సామాజికంగాను నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై జనసేన పార్టీ నేత, నటుడు కొణిదెల నాగబాబు స్పందించారు. వలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, అతనికి తన వంతుగా రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

నాగబాబు ప్రకటనలోని ముఖ్యాంశాలు: 

పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కష్టపడే సాధారణ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని నాగబాబు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదం కారణంగా వలీ శివరాత్రి జాతరలో వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే అతని బాధను అర్థం చేసుకుని వ్యక్తిగతంగా రూ. 25 వేల సాయం అందించానని తెలిపారు.

ఆహార నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయని, ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలి తప్ప, వ్యక్తులను వేధించకూడదని సూచించారు.

ఈ సంఘటనను మతం కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ జీవనం సాగించే కోట్లాది మంది చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఐటీ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఎం.ఎస్.ఎం.ఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ దాడిని ఖండించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చిరువ్యాపారుల ప్రాధాన్యత

పెద్దగా మూలధనం లేకపోయినా, జాతర్లలో ,కూడళ్లలో చిన్న దుకాణాలు పెట్టుకుని జీవించేవారు మన దేశంలో కోట్లాది మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు ఇటువంటి చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధారపడుతున్నారని నాగబాబు గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *