Naga Shaurya: జనవరి 22 హీరో నాగశౌర్య పుట్టిన రోజు. 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నాగశౌర్య 2011లో ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ మూవీతో చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆంథాలజీ తరహాలో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘చందమామ కథలు’తో నటుడిగా గుర్తింపు పొందాడు. మూడో చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోగా చక్కని విజయాన్ని అందుకున్నాడు నాగశౌర్య. అక్కడ నుండి పలు విజయవంతమైన చిత్రాలలో నటించాడు. సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘ఛలో’తో గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు. ఈ సినిమాతోనే రశ్మికా మందణ్ణ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే… నాగశౌర్య తాజా చిత్రం టైటిల్ ను అతని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. దీనికి ‘బ్యాడ్ బోయ్ కార్తీక్’ అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమాను రామ్ దేశిన దర్శకత్వంలో శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. విధి హీరోయిన్ గా నటిస్తున్న ‘బ్యాడ్ బోయ్ కార్తీక్’ మూవీకి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
