NADENDLA MANOHAR: ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో జరిగిన ఐసీఏఐ (చార్టర్డ్ అకౌంట్స్ సంస్థ) జాతీయ విద్యార్థుల సదస్సులో మాట్లాడుతూ, తాను ఒకప్పుడు సీఏ కావాలనుకున్నానని, ఆర్టికల్స్ కూడా పూర్తి చేశానని తెలిపారు. అయితే చివరికి తన మార్గం రాజకీయాలవైపు మళ్లిందని చెప్పారు.
ప్రభుత్వ లెక్కలపై ఆడిటింగ్ ఆరేళ్ల తర్వాత జరగడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. అలా ఆలస్యంగా ఆడిట్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా సీఏలు లేదా న్యాయవాదుల మద్దతు అవసరమని చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వ్యవసాయ ఆధారితంగా కాక సాంకేతికత ఆధారితంగా మారుతోందని పేర్కొన్నారు. కొనుగోలు శక్తిలో భారత్, జపాన్‌ను అధిగమించిందని తెలిపారు. రాష్ట్రానికి అనేక అంతర్జాతీయ సంస్థలు రానున్నాయని, వాటికి సీఏల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024 చివరి నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించి, వాట్సాప్ ద్వారా పంటల కొనుగోళ్లు జరగడంతో 74,000 మంది రైతులు నమోదు చేసుకోగా, 18,000 మంది తమ పంటను విజయవంతంగా అమ్మారని వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి తెస్తామని, ధాన్యం బస్తాలపై క్యూఆర్ కోడ్‌లు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు దేశాభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలని, అందుకే పీ4 (ప్రజా భాగస్వామ్యం) పథకాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.