Mukkoti Ekadashi

Mukkoti Ekadashi: ముక్కోటి శోభ: దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి

Mukkoti Ekadashi:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్న ఈ శుభదినాన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలైన తిరుమల, భద్రాచలం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

శేషాచల క్షేత్రమైన తిరుమలలో సోమవారం అర్థరాత్రి 12:05 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు అర్చకులు శ్రీవారి మూలవిరాట్టుకు అత్యంత ఏకాంతంగా విశేష కైంకర్యాలు నిర్వహించి, ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేకువజామున 1:30 గంటల నుండి ప్రముఖుల దర్శనాలు ప్రారంభం కాగా, ఉదయం 5:00 గంటల నుండి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులను అనుమతించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 8వ తేదీ వరకు అంటే పది రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కేవలం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ తిరుమలలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య తెరుచుకున్న వైకుంఠ ద్వారం వద్ద రామయ్యను చూసేందుకు భక్తులు పోటెత్తారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. చిన్నవెంకన్న ఆలయంలో వీఐపీలు, వృద్ధులు మాలధారణలో ఉన్న గోవింద స్వాములకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థాన అధికారులు తాగునీరు మరియు ఇతర మౌలిక వసతులను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసా?

శైవక్షేత్రమైన శ్రీశైలంలో కూడా ముక్కోటి సంబరాలు మిన్నంటాయి. తెల్లవారుజామున 3:00 గంటలకే ద్వారాలు తెరిచిన అర్చకులు, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. రావణ వాహనంపై కొలువుదీరిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం పురవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఇటు విశాఖలోని సింహగిరిపై కొలువైన వరాహ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం శాస్త్రోక్తంగా మొదలైంది. ఆలయ ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు తొలి దర్శనం చేసుకోగా, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు వంటి ప్రముఖులు అప్పన్నను దర్శించుకున్నారు. భక్తులకు సులభతర దర్శనం కల్పించేందుకు సింహాచలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామి వారి దర్శనం చేసుకుంటే సమస్త పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందన్న నమ్మకంతో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అన్ని ఆలయాల్లోనూ రద్దీకి అనుగుణంగా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *