Karnataka: కొన్నిసార్లు ప్రజలు భలే విచిత్రమైన పనులు చేస్తారు. ఫస్ట్రేషన్ లో కొందరు చేసే పనులు నవ్వు పుట్టిస్తాయి. అలాటిదే ఒక సంఘటన కర్ణాటకలో జరిగింది. ఎవరికి ఇబ్బంది కలిగిందో ఏమిటో కానీ.. ఏకంగా దేవుడికి డబ్బు ఇచ్చి తన అత్త చచ్చిపోవాలంటూ కోరుకున్నారు. ఆసక్తికరంగా ఉంది కదూ. ఇప్పుడు ఇలా దేవుణ్ణి కోరుకున్నది ఎవరు అనే చర్చ ఆ ప్రాంతంలో గట్టిగ జరుగుతోంది. ఇంతకీ ఏమి జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రంలోని కలపురాకి అబ్సల్‌పురాలోని కటరక గ్రామంలో భాగ్యవంతి దేవాలయం ఉంది. ఇది చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది.
బయట జిల్లాల నుంచి రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. అందులోనూ మంగళ, శుక్ర, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: AP News: పవన్‌కల్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత
Karnataka: ఇక్కడ మూడు, నాలుగు నెలలకు ఒకసారి గుడి హుండీలలో భక్తులు వేసిన ముడుపులు లెక్కించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం హుండీలు తెరిచి కానుకలను లెక్కించారు. దీనిలో రూ.60.05 లక్షల నగదు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయి.
చాలామంది భక్తులు హుండీలో తమ కోరికల చిట్టాను రాసిన కాగితాలను కూడా తమ డబ్బుతో కలిపి హుండీలో వేశారు. పెళ్లి కావాలని కొందరు.. తమ పిల్లల ఆరోగ్యం బాగుపడాలని మరికొందరు.. ఉద్యోగం త్వరగా వచ్చేలా చూడు తల్లీ అని ఇంకొందరు.. ఇలా తమ తమ కోరికలను అమ్మవారికి రాతపూర్వకంగా తెలుపుకున్నారు. అయితే, ఒకరు మాత్రం చాలా విచిత్రమైన కోరికను వ్యక్తపరిచారు. అది చాలా వైలెంట్ గా ఉంది. అమ్మవారి హుండీలో ఒకరు 20 రూపాయల నోటును కానుకగా వేసి.. దానిపై “మా అత్తగారు త్వరగా చనిపోవాలి” అని పెన్నుతో రాశారు. ఇది చూసిన హుండీ డబ్బు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. ఇంత విచిత్రంగా కోరుకున్న వ్యక్తి ఎవరో కానీ.. పాపం అనుకున్నారు. ఎంత ఫస్ట్రేషన్ లేకపోతే ఇలా రాస్తారని అధికారులు అంటున్నారు. ఈ నోటు వేసిన వారు పురుషుడా.. స్త్రీ నా అనే విషయం తెలియరాలేదు. కానీ, ఆ ఆలయ ప్రాంతంలో మాత్రం ఈ నోటు గురించి.. దానిమీద రాసిన కోరిక గురించి మాత్రం విపరీతమైన చర్చ జరుగుతోంది.