MLC kavitha: బీసీ కులగణనపై బీజేపీ తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. బీసీలను పట్టించుకోకపోవడమే బీజేపీ వైఖరా? అని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా మద్దతు ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తుల వ్యాపారాలను కుదేలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆమె ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని, ఈ విషయంపై బీజేపీ కూడా స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా బీసీ కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకువస్తే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగే అవకాశం ఉంటుందని కవిత అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ ఈ దిశగా ఏ చర్యలు తీసుకోవడంలేదని, దీని ద్వారా బీసీల పట్ల ప్రేమలేకపోవడం స్పష్టమవుతోందని ఆమె విమర్శించారు.