MLC Election 2025:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వివిధ స్థాయిల్లో సమీక్షలు జరుగుతున్నాయి. నిన్న (మార్చి 6) జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లోనూ అభ్యర్థుల అంశంపై చర్చించినట్టు వార్తలొచ్చాయి. ఇదే అంశంపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతరుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్టు సమాచారం.
MLC Election 2025:ఈ నెల (మార్చి) 29న ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి భర్తీకోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చింది. ప్రధానంగా 5 స్థానాలకు గాను ఒక స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. మిగిలిన 4 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే చాన్స్ ఉన్నది. అయితే సీపీఐ, ఎంఐఎం పార్టీలకు ఇవ్వాలని తొలుత భావించినా, ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఆ రెండు పార్టీలకు ప్రస్తుతం ఇచ్చేది లేదని తేలింది.
సామాజిక సమీకరణాలు
MLC Election 2025: పీసీసీ కోర్ కమిటీ సమావేవంలో, క్యాబినెట్ మీటింగ్‌లోనూ సామాజిక సమీకరణాల విషయమై చర్చించినట్టు తెలిసింది. నాలుగు స్థానాల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారీగా ఎమ్మెల్సీలను కేటాయించాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. దీనిని ఆమోదించుకునేందుకు అధిష్టానం వద్దకు సీఎం సహా మంత్రులు వెళ్లినట్టు తెలిసింది.
ఒక్కో స్థానానికి ముగ్గురితో జాబితా
MLC Election 2025: నాలుగు ఎమ్మల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో ఆశావహులు ఉండటం గమనార్హం. పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని, బహిరంగంగానే తమకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు కోరుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంపిక తలకు మించిన భారంగా మారినట్టు అంచనాలు తెలస్తున్నాయి. ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి పార్టీ అధిష్టానానికి నివేదిక పంపినట్టు సమాచారం.
సామ రామ్మోహన్‌రెడ్డికి చాన్స్!
MLC Election 2025:ఓసీ కోటాలో టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డికి ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో ఖరారైనట్టు తెలుస్తున్నది. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ వస్తున్న ఆయనకు యూత్‌లో మంచి క్రేజీ ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ తరఫున వివిధ వేదికల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పైనా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, అధిష్టానం ముఖ్యులు కూడా సామ రామ్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నారని తెలుస్తున్నది. ఓసీ కోటాలో పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నా, సామ రామ్మోహన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారని తెలిసింది.
ఆశావహులు జాబితా పెద్దదే
MLC Election 2025:కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నది. అయితే షార్ట్‌లిస్టులో ఓసీ జాబితాలో సామ రామ్మోహన్‌రెడ్డికి కన్ఫామ్ అయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా, వివిధ సామాజిక వర్గాల వారీగా మరికొందరి పేర్లు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సంపత్‌కుమార్, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, విజయాబాయి, కనగాల మహేశ్, చరణ్ కౌశిక్, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్ తదితరుల పేర్లు షార్ట్ లిస్ట్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.