MLC Election 2025: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు కాంగ్రెస్ పార్టీలో పూర్తయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే ఎమ్మల్సీ అభ్యర్థులను ఖరారు చేసిందని తెలిసింది. రేపే నామినేషన్ గడువు ఉండటంతో ఈ రోజే ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతుంది. ఈ రోజు ఢిల్లీ వెళ్లాలనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్యుల పర్యటన రద్దయింది. ఎవరూ ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని, తామే జాబితాను ఫోన్‌లో, మెసేజ్ రూపంలో పంపుతామని చెప్పినట్టు తెలిసింది. దీంతోనే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన రద్దయిందని తెలుస్తున్నది.
MLC Election 2025: ఏఐసీసీ కీలక నేతల కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో అందుబాటులో లేకపోవడం కూడా రేవంత్‌రెడ్డి పర్యటన రద్దుకు మరో కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఆశావహుల సంఖ్య కాంగ్రెస్‌లో భారీగా ఉండటంతో చివరి దాకా కసరత్తు జరుగుతున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ఫైవ్‌మెన్ కమిటీ ఒక్కో ఎమ్మెల్సీ స్థానం కోసం ముగ్గురు చొప్పున జాబితాన పంపింది. ఈ మేరకు నాలుగు స్థానాల కోసం 12 నుంచి 15 మంది పేర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.
MLC Election 2025: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. సామాజిక సమీకరణాల వారీగా ఈ ఎంపిక ఉంటుందని అంటున్నారు. అయితే ఈసారి బీసీలకు అవకాశం ఉండకపోవచ్చని మరో వార్త బయటకు పొక్కింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మహేశ్‌కుమార్‌కు అవకాశం ఇచ్చామని, ఎంపీగా మరో బీసీ అయిన అనిల్‌కుమార్‌కు ఇచ్చామని ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం ఇస్తామనే ధోరణలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది.
MLC Election 2025: ఓసీ క్యాటగిరీ నుంచి ప్రధానంగా సామ రామ్మోహన్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, కుసుమకుమార్ పేరు కూడా అధిష్టానం మదిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎస్సీ కోటా నుంచి సంపత్‌కుమార్, అద్దంకి దయాకర్‌లో ఎవరిదో ఒకరి పేరు ఖరారయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తున్నది. ఎస్టీ కోటా నుంచి బెల్లయ్యనాయక్, విజయాబాయి, రేఖానాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీసీలకు అవకాశం వస్తే వీ హనుమంతరావు, కొనగాల మహేశ్, ఈరవత్రి అనిల్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. మైనార్టీ కోటాలో అజారుద్దీన్ పేరే ముఖ్యంగా వినపడుతున్నది. ఇదిలా ఉంటే చివరి దశలో జరిగే వడపోతలో కొత్తపేర్లు కూడా ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.