Political News: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. సొంత పార్టీ మంత్రులపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారా? అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, ముగ్గురు మంత్రుల తీరుపై విసిగిపోయిన కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
గంటల కొద్దీ వెయిటింగ్.. కలిసినా అవహేళన!
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వింటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. “మేం వెళ్లేది సొంత పనుల కోసం కాదు, నియోజకవర్గ సమస్యల కోసం. కానీ మంత్రుల ఇంటికి వెళ్తే గంటల తరబడి కాపలా కాయాల్సి వస్తోంది. తీరా కలిసినా, గౌరవంగా మాట్లాడటం పక్కన పెడితే అవహేళన చేస్తున్నారు” అని ఆయన వాపోయారు. ఇలాంటి అనుభవమే మెజార్టీ కొత్త ఎమ్మెల్యేలకు ఎదురవుతుండటం గమనార్హం.
యువ ఎమ్మెల్యేల ఆగ్రహం – సీనియర్ల అసహనం
దక్షిణ తెలంగాణకు చెందిన యువ ఎమ్మెల్యేలు ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. “మేము కూడా ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలమే. మాకే సమయం ఇవ్వకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీరు అధిష్ఠానానికి లిఖితపూర్వక ఫిర్యాదులు పంపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Youtuber: యూట్యూబర్ కి ఎక్కడివి? లాంబో.. బెంజ్ కార్లు సీజ్..
మరోవైపు, పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతలకు సైతం మంత్రుల నుంచి చుక్కెదురవుతోంది.మంత్రులు ఫోన్ చేసినా స్పందించడం లేదని సీనియర్ల కంప్లయింట్. పదవి రాగానే సదరు నేతల్లో అహంకారం పెరిగిందని, ఇది పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్షాళన దిశగా రేవంత్ అడుగులు?
ఫిర్యాదులు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి, అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగిస్తారా లేక ఫిర్యాదులకు గురైన మంత్రులపై చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిని ఆయా శాఖల నుంచి తప్పించి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో ఈ “ముగ్గురు” మంత్రులపై వేటు పడే అవకాశం ఉందా లేదా వారి శాఖలను మారుస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్.
