Crime News: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని రద్దీ వాణిజ్య ప్రాంతమైన ప్రీత్ విహార్ (Preet Vihar)లో ఒక కేఫ్ మూసిన తర్వాత జరిగిన ఆఫ్టర్-అవర్స్ పార్టీలో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. మంగళవారం (నవంబర్ 24, 2026) తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు, ఆమె స్నేహితులు మరియు నిందితులంతా వేర్వేరు కేఫ్‌లలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ఒక కేఫ్ మూసిన తర్వాత అక్కడే పార్టీ చేసుకోవాలని వీరంతా ప్లాన్ చేసుకున్నారు. బృందంలోని ఒకరి వద్ద ఆ కేఫ్ తాళాలు ఉండటంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, తొలుత ఆ కేఫ్‌లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు కలిసి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఆ తర్వాత వారంతా కలిసి మండౌలి (Mandawali) ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిందితుల్లో ఒకరు పనిచేస్తున్న ప్రీత్ విహార్‌లోని మరో కేఫ్‌కు చేరుకున్నారు.
అక్కడ అందరూ మద్యం సేవించారని, సరిగ్గా తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇద్దరు పురుషులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మిగిలినవారు కూడా ఈ నేరానికి సహకరించారని ఆమె ఆరోపించారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలు తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని చెప్పినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
ఈ ఘోరంపై తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు పురోగతిపై తూర్పు ఢిల్లీ డీసీపీ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ఘటనలో ప్రమేయమున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని ఇప్పటికే అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
