Revanth Reddy

Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్..!

Revanth Reddy: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా బుధవారం (నవంబర్ 25, 2026) ప్రారంభమైన 18వ ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో’ (Poultry India Expo) అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఫ్యూచర్ సిటీ (Future City)లో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ఇందుకు అవసరమైన భూకేటాయింపులపై త్వరలో జరగనున్న ‘గ్లోబల్ సిటీ సమ్మిట్’లో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్‌పోకు దేశ, విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పౌల్ట్రీ రంగాన్ని తమ ప్రభుత్వం కేవలం ఒక వ్యాపారంగా కాకుండా, సమాజానికి అవసరమైన పోషకాలను అందించే ‘ప్రొటీన్ ఇండస్ట్రీ’గా చూస్తోందని తెలిపారు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు సహజమని, సంక్షోభ సమయాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని, రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 5.3 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని, పౌల్ట్రీ పరిశ్రమ సహకారంతోనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారంగా గుడ్లను అందించగలుగుతున్నామని సీఎం పేర్కొన్నారు.
ఎల్ నినో (El Nino) ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదని, రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి పౌల్ట్రీ రంగానికి ఎంతో మేలు చేసే మంచి పాలసీలు తెచ్చారని సీఎం గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన మంచి పాలసీలను కూడా తమ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తోందని చెప్పారు.
పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారుతుంటాయని, కానీ తెలంగాణలో ఏ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నా దాన్ని రద్దు చేయకుండా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని, 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని దేశానికే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *