Ponnam Prabhakar: గురుకుల టెండర్ల వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, పోలీసులతో అరెస్టులు చేయించేంత పిరికివాళ్లం తాము కాదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేస్తోన్న ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. గన్ పార్క్ వద్దకు రమ్మని సవాల్ విసిరి, తీరా తాము అక్కడికి వెళ్లాక ఫోన్ లిఫ్ట్ చేయలేదంటూ హరీష్ రావు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తాము ఎటు పారిపోలేదని, గన్ పార్క్ పరిసరాల్లో ఉన్న గోషా మహల్, మలక్ పేట ప్రాంతాలలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటే.. తాము మంత్రులుగా ఆ అధికారిక విధులకు హాజరయ్యామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పదే పదే తాము ఫోన్ లిఫ్ట్ చేయలేదంటున్న హరీష్ రావుకు కౌంటర్ ఇస్తూ.. “ఆయనే రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? మేము మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఎలా మాట్లాడుతాం?” అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్ లు కిందిస్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులని, తమ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసని గుర్తుచేశారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో కుమ్మక్కై లాభపడిన కొందరు చెంచా గాళ్లు వచ్చి.. ఏది చెప్తే అది నమ్మి ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ చెల్లదని హెచ్చరించారు.
గురుకుల పాఠశాలల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. “గురుకులాల్లో వస్తువుల సరఫరాకు సంబంధించి మొత్తం టెండర్ల విలువ రూ. 1,142 కోట్లు అయితే.. అందులో రూ. 2 వేల కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది?” అని ఆయన లాజిక్‌ను ప్రశ్నించారు. చేతిలో కొన్ని కాగితాలు పట్టుకుని మీడియా ముందు తిరిగినంత మాత్రాన ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఆరోపణలు నిజాలు అయిపోవన్నారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే, ఐఏఎస్ అధికారులతో పూర్తిస్థాయి రివ్యూ చేయించి గ్లోబల్ టెండర్ల ద్వారా ఓపెన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్‌ను తీసుకువచ్చామని, ఇందులో పూర్తి పారదర్శకత ఉందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో జిల్లాల వారీగా వస్తువుల ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉండేవని మంత్రి ఆరోపించారు. కందిపప్పు సిద్దిపేటలో ఒక ధరకు దొరికితే, వికారాబాద్‌లో మరో ధరకు దొరికేదని.. అటువంటి లోపాలను సరిదిద్ది ఇప్పుడే వ్యవస్థను స్ట్రీమ్‌లైన్ చేశామని చెప్పారు. తాము నామినేషన్ పద్ధతిపై ఎవరికైనా ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. జర్నలిస్టులు కూడా ఆర్టీఐ (RTI) ద్వారా డాక్యుమెంట్లు తీసుకుని ఈ కొనుగోళ్ల ప్రక్రియను విశ్లేషించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హాస్టల్ పిల్లలకు ఏం ఇచ్చారో.. తాము అధికారంలోకి వచ్చాక ఏం ఇస్తున్నామో శాసనసభ సాక్షిగా చర్చించడానికి సిద్ధమని, తాము రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులమని, భయపడే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.
