Allahabad HC:

Allahabad HC: ‘హలాలా, ట్రిపుల్ తలాక్’ సమాజానికే చీకటి అధ్యాయం.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

Allahabad HC: భారతదేశంలో మతపరమైన వ్యక్తిగత చట్టాల (Personal Laws) ముసుగులో మహిళలపై జరిగే క్రూరమైన లైంగిక దోపిడీని ఇంకా అరాచకాలను ఎంతమాత్రం అనుమతించలేమని అలహాబాద్ హైకోర్టు అత్యంత ఘాటుగా స్పష్టం చేసింది. నికాహ్ హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి పద్ధతులు సమాజపు ‘చీకటి అధ్యాయం’ (Dark Page) అని కోర్టు అభివర్ణించింది. ఇవి రాజ్యాంగ విలువలకు, లింగ సమానత్వానికి అలాగే మానవ గౌరవానికి పూర్తిగా విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

వ్యక్తిగత చట్టాలు ఏవైనా సరే.. అవి నేరపూరిత చర్యలకు రక్షణ కవచంగా (Shield) మారలేవని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్, ఈ ఘోరానికి పాల్పడిన బాధితురాలి మాజీ భర్త, మామ, ఒక మౌలానా (మత పెద్ద) సహా ఇతర నిందితులు తమపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) ను రద్దు చేయాలని, అరెస్టులపై స్టే విధించాలని దాఖలు చేసిన పిటిషన్లను పూర్తిగా కొట్టివేసింది.

సమాజ సామూహిక మనస్సాక్షిని కదిలించే నేరం..

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా, సైద్‌నగ్లి ప్రాంతంలో వెలుగుచూసిన ఒక దారుణమైన కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఈ కేసు ఒక మైనర్ బాలికపై పక్కా ప్రణాళికతో జరిగిన సామూహిక అత్యాచారాన్ని (Premeditated Gang Rape) సూచిస్తోందని, దీనిపై లోతైన సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు నిర్ధారించింది.

చట్టం ఇంకా సాంప్రదాయాల ముసుగులో జరుగుతున్న ఇటువంటి చర్యలు కేవలం చట్టరీత్యా నేరాలు మాత్రమే కావు.. సమాజం సామూహిక మనస్సాక్షిని (Collective Conscience) సైతం తీవ్రంగా కదిలిస్తాయి. ఇలాంటి అరాచకాలను మొగ్గలోనే తుంచేయాలి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

బాధితురాలిని వెంటాడిన దారుణాల హిస్టరీ..

ఎఫ్ఐఆర్ (FIR) లో నమోదైన వివరాల ప్రకారం, బాధితురాలి జీవితాన్ని మతం, ఆచారాల పేరుతో నిందితులు ఎలా ఛిన్నభిన్నం చేశారో క్రింది టైమ్‌లైన్ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు:

ఏప్రిల్, 2015 న బాధితురాలికి కేవలం 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రధాన నిందితుడైన అజహర్ నవాజ్‌తో బలవంతంగా పెళ్లి చేశారు.  కానీ జనవరి, 2016 పెళ్లయిన కొన్ని నెలలకే భర్త అజహర్ నవాజ్ ఆమెకు మూడు సార్లు ‘తలాక్’ చెప్పి విడాకులు ఇచ్చాడు. (భారతదేశంలో ట్రిపుల్ తలాక్ 2019లో చట్టవిరుద్ధంగా ప్రకటించబడింది). కొన్ని నెలల తర్వాత నవాజ్ నవంబర్, 2016  ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు తీసుకున్న భార్యను మళ్లీ చేసుకోవాలంటే.. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకోవాలి (హలాలా). దీంతో కేవలం 16 ఏళ్ల వయసున్న ఆ బాలికకు మౌలానా ఖయ్యూమ్‌తో బలవంతంగా ‘నికాహ్ హలాలా’ జరిపించారు. ఆ సమయంలో హలాలా అంటే ఏమిటో కూడా తనకు తెలియదని బాధితురాలు పేర్కొంది.

హలాలా ప్రక్రియ ముగిసిన తర్వాత 2017లో నవాజ్ ఆమెను తిరిగి పెళ్లి చేసుకున్నాడు. అయితే, నాలుగేళ్ల తర్వాత (2021లో) నవాజ్ మరోసారి ఆమెకు విడాకులు ఇచ్చి, వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. నవాజ్ కొత్త భార్యకు పిల్లలు కలగకపోవడంతో, అతడు మళ్లీ బాధితురాలిని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే, ఈసారి ఆమె రెండుసార్లు విడాకులు తీసుకుంది కాబట్టి, ‘డబుల్ హలాలా’ చేయాలని నిందితుడి సోదరుడు షానవాజ్ చౌదరి, బంధువు హకీమ్ నిషాత్ చెప్పారు. ఆచారాల నెపంతో వారిద్దరూ ఫిబ్రవరి 19న ఆమెపై క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఎదిరిస్తే ఆమెను, ఆమె కూతురిని చంపేస్తామని బెదిరించారు. అదే రోజు సాయంత్రం మౌలానా నదీమ్ సహాయంతో ఒక బూటకపు పెళ్లి నాటకం ఆడించి, నవాజ్‌తో సంసారం చేసేలా ఒప్పించారు.

నిందితుల వాదనను తిప్పికొట్టిన కోర్టు:

నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ‘నికాహ్ హలాలా’ గుర్తింపు పొందిన ఆచారమని, అలాగే 2016 నాటికి ‘ట్రిపుల్ తలాక్’ చట్టబద్ధమైనదేనని పేర్కొన్నారు. ఆస్తి తగాదాలు, కూతురి కస్టడీ వివాదాల వల్లే తమపై తప్పుడు కేసు పెట్టారని, కొందరి పాత్ర ఇందులో చాలా స్వల్పమని వాదించారు.

అయితే, అలహాబాద్ హైకోర్టు ఈ వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రాథమిక విచారణ దశలో ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఒక మైనర్ బాలికను ఆచారాల పేరుతో పదే పదే లైంగిక దోపిడీకి గురిచేయడం అత్యంత తీవ్రమైన విషయమని, దర్యాప్తు సంస్థ ఈ కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేసు విచారణను కొనసాగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *