Payyavula Keshav

Payyavula Keshav: రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారు

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్‌లో నేరమయ రాజకీయాలను, ఫ్యాక్షనిజాన్ని ప్రవేశపెట్టిందే వైఎస్ కుటుంబమని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకోవడం వైఎస్ ఫ్యామిలీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) కి మొదటి నుండి ఉన్న అలవాటేనని ఆయన మండిపడ్డారు.

అప్పట్లో ఆధిపత్య పోరు మాత్రమే.. రాజారెడ్డితోనే ఫ్యాక్షనిజం!

గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ.. అది కేవలం కేవలం ఆధిపత్య పోరుగా మాత్రమే ఉండేదని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. అప్పట్లో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఫ్యాక్షనిజానికి దూరంగా ఉండేవారని, కానీ క్షేత్రస్థాయిలో రాజారెడ్డి ఎప్పుడైతే గ్రూపులను ప్రోత్సహించడం మొదలుపెట్టారో, అప్పటి నుండే రాజకీయాలు నేరమయంగా మారాయని ఆరోపించారు.

టీడీపీ కార్యకర్తల ఇళ్లను డైనమైట్లు పెట్టి పేల్చేసిన చరిత్ర రాజారెడ్డిదని పయ్యావుల విమర్శించారు. ఒక ఇంటిని బాంబులతో పేల్చేసి నాడు వారు ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టించారో ఇవాల్టి తరానికి, సమాజానికి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి రాజారెడ్డి నుండి నేటి వైఎస్సార్ సీపీ నాయకుల వరకు అదే నైజం కొనసాగుతోందని, “రప్పా రప్పా నరకుతాం” అంటూ వైసీపీ నాయకులు ఇంకా రెచ్చిపోతున్నారని దుయ్యబట్టారు.

జగన్ అమాయకుడంటూ ‘సెల్ఫ్ సర్టిఫికెట్’!

గతంలో వైఎస్ కుటుంబం చేసిన నేరాల వల్ల ఇప్పటికే ఒక తరం నష్టపోయిందని మంత్రి పయ్యావుల అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు “గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అని చెబుతున్నా వారికి బుద్ధి రావడం లేదన్నారు. ఇంతటి నేర చరిత్రను వెనక పెట్టుకుని, ఇప్పుడేమో వైఎస్ జగన్ తాను చాలా అమాయకుడినంటూ సొంతంగా ‘సెల్ఫ్ సర్టిఫికెట్’ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు:

  • వైసీపీ ప్రభుత్వంలో ‘శుక్రవారం భయం’: గత వైసీపీ ప్రభుత్వంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఈ వారం ఎవరి ఇంటిని కూలుస్తారో, ఎవరిపై కక్షసాధింపు చర్యలు దిగుతారోనని ప్రజలు, విపక్షాలు భయపడే పరిస్థితి ఉండేది.

  • అన్ని రంగాలపై గొడ్డలివేటు: గత ఐదేళ్ల పాలనలో పరిశ్రమలతో పాటు రాష్ట్రంలోని అన్ని రంగాలపై గొడ్డలివేటు వేసింది వైసీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. నేరం చేయడం అనేది వైఎస్ కుటుంబ నైజమని విమర్శించారు.

కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక ప్రగతి..

గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోతే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 800 కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని, చాలా కంపెనీలు తమ పనులను కూడా మొదలుపెట్టాయని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *