Medico Priyanka Case: రాజమహేంద్రవరంలో ఈ నెల 3న కొందరు యువకులు కారుతో నిర్లక్ష్యంగా ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన నింపింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యంగ్ డాక్టర్ అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
-
కఠిన చట్టపరమైన చర్యలు: కేవలం నిర్లక్ష్యంగా కారు నడపడమే కాకుండా, ఒక యువతి ప్రాణం పోవడానికి కారణమైనందున నిందితులకు కోర్టులో కఠిన శిక్షలు పడేలా బలమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
-
పవన్ కళ్యాణ్ సానుభూతి: భవిష్యత్తులో వైద్యురాలిగా సమాజానికి ఎంతో సేవలందించాల్సిన ప్రియాంక ఇలా అర్ధాంతరంగా మనల్ని విడిచిపోవడం గుండెలను పిండేస్తోంది. నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చూస్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం
రాజమహేంద్రవరం నుంచి ప్రియాంక తండ్రితో పాటు స్థానిక పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తారు. అనంతరం ప్రియాంక భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కళ్లముందే వైద్యురాలిగా స్థిరపడాల్సిన కూతురు శవమై ఇంటికి వస్తుండటంతో ప్రియాంక తల్లిదండ్రులు, బంధువుల రోదనలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేస్తున్నాయి.
