Manchu vishnu: తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం ఎవరి మనోభావాలనూ దెబ్బతీసే ఉద్దేశంతో కాదు అని నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇటీవల ఈ చిత్రంలోని కొన్ని పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు ‘పిలక, గిలక’ తమ మనోభావాలను కించపరుస్తున్నాయంటూ విమర్శించాయి. అవి తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించాయి కూడా.
ఈ నేపథ్యంలో స్పందించిన మంచు విష్ణు –
“ఎవరికీ బాధ కలగకుండా సినిమాను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాం. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, పరమశివుడిని భక్తితో చూపించాం. ప్రతిరోజూ షూటింగ్‌కు ముందు పూజలు చేసేవాళ్లం. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నాం,” అని తెలిపారు.
అలాగే, స్క్రిప్ట్ దశ నుంచే వేదాధ్యయనంలో అనుభవం ఉన్న పండితులు, ఆధ్యాత్మికవేత్తల సలహాలు తీసుకున్నామన్నారు. “ఈ సినిమాతో వివాదాలు సృష్టించాలన్న ఉద్దేశం లేదని, భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడమే అసలు లక్ష్యం” అని స్పష్టం చేశారు.
“సినిమా విడుదలయ్యే వరకు ఆతురత కాకుండా సంయమనం పాటించండి. పూర్తిగా చూసిన తర్వాతే అభిప్రాయం ఇవ్వండి,” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి, ‘కన్నప్ప’ చిత్రం ద్వారా భక్తి భావనను ప్రజల్లో పెంపొందించాలన్నదే తమ ప్రయత్నమని మంచు విష్ణు పునరుద్ఘాటించారు.