Manchu manoj: నటుడు మంచు మనోజ్ కుటుంబ వివాదాల నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసారు. జల్‌పల్లిలోని తన నివాసం కొందరు ఆక్రమించుకున్నారని, ఆ ఆస్తిని ఖాళీ చేయించాలని కోరుతూ ఇటీవల ఆయన తండ్రి మోహన్ బాబు జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. మోహన్ బాబు ఫిర్యాదు ఆధారంగా జల్‌పల్లిలో నివసిస్తున్న మంచు మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు.
ఈ నోటీసుల నేపథ్యంలో మనోజ్ నేడు విచారణ కోసం కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మా మధ్య ఎటువంటి ఆస్తి గొడవలు లేవు. చాలా రోజులుగా నేను కూర్చొని మాట్లాడదాం అని అడుగుతున్నా, కానీ ఎవరూ స్పందించడం లేదు. నాకు ఎవరి భయం లేదు, ఎక్కడ పిలిచినా వస్తాను. ఇది ఆస్తి సమస్య కాదు. మా విద్యాసంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. వారి హక్కుల కోసం పోరాడుతున్నాను. నా విద్యార్థుల కోసం, నా బంధువుల కోసం, నా ప్రజల కోసం ఈ పోరాటం కొనసాగుతుంది,” అని మనోజ్ స్పష్టంచేశారు.