Road Accident: మంచిర్యాల జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న భయానక ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నస్పూర్ గేట్ ఏరియా సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రమాదం జరిగిందిలా..
నస్పూర్ గేట్ ఏరియా నేషనల్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీకి ఎదురుగా ఉన్నట్టుండి ఆటో అదుపుతప్పి రాంగ్ రూట్‌లోకి (లారీ వస్తున్న ట్రాక్‌లోకి) దూసుకురావడంతో ఈ ఘోరం జరిగినట్లు స్పష్టమైంది.
ముగ్గురు స్పాట్ డెడ్ – ఐదుగురికి తీవ్ర గాయాలు..
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వీరిలో అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మి ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే నస్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు.
