Globe Trotter Event

Globe Trotter Event: వారణాసి ఈవెంట్ ఖర్చు తో మూడు చిన్న సినిమాలు తీయొచ్చు

Globe Trotter Event: టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ చిత్రం టైటిల్ ‘వారణాసి’ ఖరారైంది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడానికి, సినిమా ఎలా ఉండబోతోందో చూపించడానికి చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రాటర్’ పేరిట భారీ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ గ్రాండ్‌గా సక్సెస్ అవ్వడంతో పాటు, దాని వెనుక పెట్టిన భారీ ఖర్చు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టైటిల్ లాంచ్‌కే రికార్డు వ్యయం

సాధారణంగా సినిమాల టీజర్లు లేదా ఆడియో వేడుకలకు భారీ ఖర్చు చేస్తుంటారు. కానీ, ‘వారణాసి’ చిత్రానికి కేవలం టైటిల్ లాంచ్, గ్లింప్స్ ప్రదర్శన కోసమే కోట్లు వెచ్చించడం ఇండస్ట్రీలో ఒక రికార్డుగా నిలిచింది.

ఈ కార్యక్రమం కోసం మొత్తం ₹10 కోట్ల నుంచి ₹15 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, టైటిల్ లాంచ్‌ కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన మొట్టమొదటి ఈవెంట్ ఇదే అవుతుంది.

ఈవెంట్‌లో ప్రధానంగా హైలైట్ అయింది గ్లింప్స్‌ను ప్రదర్శించిన భారీ ఎల్ఈడీ స్క్రీన్. దాదాపు 100×130 అడుగుల (సుమారు 13 వేల చదరపు అడుగుల) వైశాల్యం కలిగిన ఈ స్క్రీన్ ఏర్పాటు కోసమే ₹30 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. దీనికి కావాల్సిన భారీ స్కఫోల్డింగ్ సపోర్ట్‌ను నిర్మాత కే.ఎల్. నారాయణ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సమకూర్చడం కొంత ఉపశమనం.

రాజమౌళి కుమారుడి స్పెషల్ ప్లానింగ్

ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ ప్లానింగ్ మొత్తం రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ దగ్గరుండి చూసుకున్నారు. ఈవెంట్ కంపెనీలను ఎంగేజ్ చేయకుండా, కార్తికేయ టీమ్ స్వయంగా డిజైన్ చేసి అమలు చేయడం విశేషం. వెన్యూ సెటప్, కుర్చీలు, సోఫాలు, నటీనటుల వసతి, హాలీవుడ్ మీడియాకు రవాణా వంటి మిస్సేలినియస్ ఖర్చులు కూడా ఈ భారీ వ్యయంలో భాగమే.

ఇది కూడా చదవండి: Rithu Chowdary: అతని కోసం ఇంట్లో నుండైనా వెళ్ళిపోతా..

స్పాన్సర్‌షిప్ భారం

నిర్మాతపై పూర్తి భారం పడకుండా, ఈ ఈవెంట్‌కు స్పాన్సర్‌షిప్ ద్వారా కొంత మొత్తం సమకూర్చుకున్నారు. ఈ ఈవెంట్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. మెయిన్ స్పాన్సర్‌గా ఉన్న ట్విలైట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సంస్థ సుమారు ₹2.5 కోట్లు అందించింది. మిగిలిన ప్రకటనల ద్వారా మరో ₹2.5 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని నిర్మాత సినిమా నిర్మాణ ఖర్చులో భాగంగానే భరించాల్సి వచ్చింది.

క్రమశిక్షణతో కూడిన ఈవెంట్

ఈ భారీ ఈవెంట్‌లో చెప్పుకోదగ్గ మరో అంశం, నిర్వహణలో కనబర్చిన క్రమశిక్షణ. ఈవెంట్‌లో ఎక్కడా జనాల తోసుకోవడాలు, తొక్కిసలాటలు వంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంతంగా లోపలకు వెళ్లి, నిదానంగా బయటకు వచ్చే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి, ఈసారి ప్రపంచవ్యాప్త ఆడియెన్స్‌ని టార్గెట్ చేశారనేందుకు ఈ భారీ ఈవెంట్ నిర్వహణ ఒక సంకేతంగా నిలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *