Crime news

Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్..!

Crime News: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ కూడలి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యువకులు సరదా కోసం పెట్టుకున్న బైక్ రేసింగ్ ఒక నిండు కుటుంబాన్ని చిదిమేసింది.

అసలు ఏం జరిగింది?

మహబూబ్‌నగర్‌కు చెందిన బాసిత్ అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలను ఒక హోటల్‌లో జరుపుకున్నారు. వేడుక ముగిసిన తర్వాత తన బంధువులను కారులో ఇంటికి దింపడానికి బయలుదేరారు. పాలకొండ జంక్షన్ వద్ద కారును యూ-టర్న్ (U-Turn) తీసుకుంటున్న సమయంలో, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక స్పోర్ట్స్ బైక్ కారు వెనుక డోర్‌ను బలంగా ఢీకొట్టింది.

ప్రమాదంలో చనిపోయిన వారు:

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ఇంకా బైక్ పైనా ఉన్న ఇద్దరు కలిసి మొత్తం ఐదుగురు మరణించారు.

కారులో ఉన్న బాసిత్ భార్య సారా (30), కుమారుడు హుజేఫా (9), బావమరిది కుమారుడు అమ్మార్ (18 నెలలు) తోపాటు బైక్ నడిపిన హైదరాబాద్‌కు చెందిన అవేజ్ (26), వెనుక కూర్చున్న అతని స్నేహితుడు యాకూబ్ (25) మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న మరికొంతమందికి గాయాలుకాగా  అందులో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదానికి కారణం ఏంటి?

హైదరాబాద్‌కు చెందిన 12 మంది యువకులు స్పోర్ట్స్ బైక్‌లపై మహబూబ్‌నగర్‌కు ఒక ఫంక్షన్‌కి వచ్చారు. తిరిగి వెళ్లే సమయానికి ఫంక్షన్‌కి పిలిచిన వ్యక్తి వారితో, “ఎవరైతే ముందుగా హైదరాబాద్ వెళ్తారో నాకు కాల్ చేయండి” అంటూ ఛాలెంజ్ విసిరాడు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న బైకర్స్ హైదరాబాద్‌కి అతివేగంగా బయలుదేరారు. ముందు వెళ్లిన 11 బైక్‌లు కూడలిని దాటేయగా, చివరగా వస్తున్న బైక్ మాత్రం కారును ఢీకొట్టింది.

మానవత్వం మరచిన స్నేహితులు

ప్రమాదం జరిగిన తర్వాత మిగిలిన బైకర్లు అక్కడికి చేరుకున్నారు. కానీ, గాయపడిన వారిని ఆదుకోవడానికి బదులు, చనిపోయిన తమ స్నేహితుల మృతదేహాలను ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాలను తీసుకుని వెళ్లారు.

వేగంగా వెళ్లడం సరదాగానే ఉంటుంది కానీ ప్రాణాలను తీస్తుంది. ఇప్పుడు చూడండి, పందెం కారణంగా వేగంగా వెళ్లడం వల్లే వాళ్లతో పాటు ఇంకొకరి కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలు పోయాయి. ఇంకా జీవితం అంటే ఏంటో కూడా తెలియని ఇద్దరు చిన్నారులు కూడా ఎందుకు చనిపోయారో తెలియకుండా చనిపోయారు. గంట లేట్ అయినా పర్లేదు కానీ, వేగంగా వెళ్లి తమతో పాటు ఇంకొకరి ప్రాణాలు తీయడం సరికాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *