MAHAA Vamsi

Mahaa Vamsi: మంచు మంటలు..జగన్, భూమా కారణమా..?

కొన్ని విషయాలు వింటున్నప్పుడు విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. కొన్ని సంఘటనలను లింక్ చేసి ఆలోచిస్తే అదోరకంగా అనిపిస్తుంది. మన ఆలోచన లేదా మనకు తట్టిన భావన ఎవరికైనా చెబితే మోకాలికి బట్టతలకు లింక్ చేయకు అని అంటారు. కానీ, లాజికల్ గా చూస్తే మాత్రం అవును కదా అనిపిస్తుంది. తరువాతి కాలంలో మనం అనుకున్న విషయాలు నిజం అయితే అప్పుడు ఎవరైనా మన వాదన కరెక్ట్ అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ప్రస్తుతం మంచు ఇంట్లో మంటలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఏడాది కాలంలో చూసుకుంటే ఇది సినిమా ప్రపంచంలో పెద్ద ఫ్యామిలీస్ లో రెండో ఘటనగా చెప్పుకోవచ్చు. మొదటి ఘటన దీనంత కొట్టుకుని రచ్చకెక్కేంత కాకపోయినా.. రెండిటికీ చాలా దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. రెండిటి సిమిలారిటీస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ రెండూ పెద్ద స్థాయిలో పేరు ఉన్నవే. పైగా ఒక కోణంలో రెండు ఫ్యామిలీల మధ్య ఎంత సఖ్యత కనిపిస్తుందో.. అంత దూరం కూడా ఉంటూవస్తోంది.
సరే ఇప్పుడు మనం ఈ రెండు ఫ్యామిలీలో రేగిన రభస గురించి ఒకసారి చెప్పుకుందాం. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తెచ్చిన చిచ్చు అంతా ఇంతా కాదు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ఏపీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉంటే.. సరిగ్గా ఎన్నికల సమయంలో తన భార్య స్నేహితురాలి భర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి.. మెగా క్యాంపులో పెద్ద కలకలం రేపారు. అప్పుడు మెగా క్యాంప్ దాదాపుగా రెండుగా చీలిపోయింది. మెగా అభిమానుల నుంచి అల్లు అభిమానులు అనే వర్గం బహిరంగంగా పుట్టుకొచ్చింది. తరువాత కూడా మొన్నటి వరకూ ఈ వేడి రగులుతూనే ఉంది. పుష్ప2 సినిమా విడుదల సమయంలో ఈ ఫైర్ స్పష్టంగా కనిపించింది. తాజాగా కాస్త చల్లారినట్టు కనిపిస్తోంది. కానీ, దాని సెగలు మాత్రం ఇంకా వేడి పుట్టిస్తూనే ఉన్నాయి.
మెగా క్యాంపు పొగలు అలా ఉంటే.. తాజాగా మంచు ఫ్యామిలీలో మంటలు భగ్గుమంటున్నాయి ప్రస్తుతం. మంచు ఫ్యామిలీ స్టోరీ ప్రస్తుతం హాట్ గా రన్ అవుతోంది. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు – మనోజ్ ఒకవైపు చేరి కేసులు పెట్టుకున్నారు. కొట్లాటలు గట్టిగానే జరిగాయి. ఇదీ రెండు ఫ్యామిలీల కహానీ సంక్షిప్తంగా.

ఇప్పుడు ఈ రెండిటి మధ్య కనపడుతున్న సారూప్యతలు ఏమిటో ఒకసారి చూద్దాం. ముందు అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన భార్య స్నేహా రెడ్డికి వైసీపీకి చెందిన శిల్పా కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది అని తెలిసినా వైసీపీ వైపే అల్లు అర్జున్ ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. అదే మెగా క్యాంప్ రెండుగా చీలిపోయినట్టు చెప్పుకోవచ్చు. ఇక మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే.. మనోజ్ తెలుగుదేశం పార్టీకి చెందిన భూమ అఖిల ప్రియ సోదరి మౌనికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇది మోహన్ బాబుకు నచ్చలేదని చెబుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే మోహన్ బాబు, విష్ణు వైసీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నపుడు బహిరంగంగానే ఆయనకు మద్దతుగా పలు విషయాల్లో మాట్లాడుతూ వచ్చారు.

ALSO READ  Hyderabad: డెంజర్ లో హైదరాబాద్

ఇప్పుడు జాగ్రత్తగా గమిస్తే రెండు విషయాల్లోనూ లింక్ వైసీపీకి ఉంది. అది కూడా స్పష్టంగా డైరెక్ట్ గానే కనిపిస్తోంది. వైసీపీకి అంటే జగన్ అనే చెప్పుకోవాలి కదా.. జగన్ కి ఇటు భూమా అఖిల ప్రియపై విపరీతమైన ద్వేషం ఉందని చెబుతారు. అటు పవన్ కళ్యాణ్ తో జగన్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ ఇద్దరినీ ఇరకాటంలో పెట్టడానికి కుటుంబ రాజకీయాలకు తేరా లేపి ఉండొచ్చనే ఒక వాదన తాజాగా వినిపిస్తోంది. ఎందుకంటే, రెండింటిలోనూ కామన్ గా.. ఉన్నది వైసీపీ. ఇంకా స్పష్టంగా చూస్తే మంచు విష్ణు భార్య విరోనికా రెడ్డి నేరుగా వైఎస్ఆర్ మేనకోడలు. ఇప్పుడు మనోజ్ పదే పదే చెబుతున్నది మా నాన్న మంచివారు. విష్ణు వలనే ఈ సమస్యలన్నీ అని. అదే కోణంలో ఆలోచిస్తే రాజకీయాలు కుటుంబాల్లోకి ప్రవేశించాయా అనే అనుమానం కలగక మానదు. సినిమాలు-రాజకీయాలు కలగలిసిపోయిన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీలోని కుటుంబాలను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రాజకీయాలకు అనుగుణంగా కుటుంబాలను విడదీసి ఆ ఇమేజితో గేమ్స్ అడ్డుకుంటున్నారా? అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి.

ఏమో ఇది మోకాలికి బట్టతలకీ ముడిపెట్టడంలా అనిపిస్తున్నా.. మంచు మోహన్ బాబు వివాదాల నేపథ్యంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఆ కోణంలో కూడా ఆలోచించాలేమో అనిపిస్తున్నాయి. మోహన్ బాబు ఈ గొడవల వెనుక ఎవరైనా నాయకుల హస్తం ఉందేమో అనే అర్ధంలో మాట్లాడారు. ఆయన దృష్టిలో అది భూమా అఖిల ప్రియ అయిఉండవచ్చని అనుకుంటున్నారు. కానీ, అదే కోణంలో ఆలోచిస్తే వైఎస్ వర్గీయులు కూడా ఉండవచ్చు కదా అనేది చాలామంది భావన! ఏదిఏమైనా తెలుగు నాట ఈ కుటుంబ కథా చిత్రం 1, 2 మాత్రం ప్రజలకు మంచి కాలక్షేపాన్ని అందిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ పదం కొంచెం ఘాటుగా అనిపించినా.. సెలబ్రిటీలను తమ సొంతంగా చూసుకునే అభిమాన జనం ఉన్న చోట ఇదేమంత పెద్ద మాట కాదేమో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *