Waqf Board: రాష్ట్ర వక్ఫ్ బోర్డు తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర రైతులు శనివారం ఆరోపించారు. వాస్తవానికి మహారాష్ట్ర స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో దాదాపు 300 ఎకరాల భూమిపై దావా కేసు నడుస్తోంది. ఈ మేరకు లాతూర్‌కు చెందిన 103 మంది రైతులకు బోర్డు నోటీసులు పంపింది. ఈ కేసులో రెండు విచారణలు జరిగాయి. తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇది వక్ఫ్ ఆస్తి కాదని, తమ పూర్వీకుల భూమి అని పేర్కొన్నారు. తరతరాలుగా దానిపైనే వ్యవసాయం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేశారు.
మీడియా కథనాల ప్రకారం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సమీర్ ఖాజీ దీనిని ఖండించారు. బోర్డు ఎవరికీ నోటీసులు పంపలేదని ఆయన మీడియాకు తెలిపారు. ఏ భూమిపైనా బోర్డు క్లెయిమ్ చేయలేదు. ఒక వ్యక్తి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు, అతనికి నోటీసు మాత్రమే పంపించాం అని వివరించారు. మరోవైపు వక్ఫ్ బోర్డు చట్టంలో మార్పులు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Maharashtra: మహారాష్ట్ర స్పీకర్ గా రాహుల్ నార్వేకర్
Waqf Board: వక్ఫ్ బిల్లును ఈ ఏడాది వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో సహా అనేక ప్రతిపక్షాలు దీనిని ముస్లిం వ్యతిరేకమని పేర్కొన్నాయి. విపక్షాల అభ్యంతరం, నిరసనల అనంతరం ఈ బిల్లు లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు.
ఈ కమిటీకి బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ అధ్యక్షత వహిస్తున్నారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందితో సహా జేపీసీకి 31 మంది సభ్యులు ఉన్నారు.ఇప్పటివరకూ 8 జేపీసీ సమావేశాలు జరిగాయి. నవంబర్ 28న జరిగిన 8వ సమావేశంలో జేపీసీ పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని తర్వాత, 2025 బడ్జెట్ సెషన్ చివరి రోజులోగా జేపీసీ నివేదికను అందజేస్తామని చెప్పారు.