KTR: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం హాజరయ్యారు. నందినగర్‌లోని తన ఇంటి నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి నేరుగా వెళ్లారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విదేశాలకు నగదు బదిలీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ఈ కేసులో ఏ1 నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఇప్పటికే ఒకసారి ఏబీసీ కార్యాలయానికి వెళ్లగా, ఆయన వెంట న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనుదిరిగి వచ్చారు.
KTR: హైకోర్టుకు వెళ్లగా కేటీఆర్ తన వెంట న్యాయవాదిని పరిమితికి లోబడి తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. దీంతో ఏబీసీ నోటీసుల మేరకు న్యాయవాదితో కలిసి గురువారం ఆయన ఏబీసీ అధికారుల విచారణకు హాజరయ్యారు. విచారణ గదిలో కేవలం కేటీఆర్ మాత్రమే ఉండేలా, విజిబుల్ డిస్టెన్స్‌లో (కేటీఆర్ కనిపించేలా) తన లాయర్ ఉండేలా కోర్టు అనుమతి ఇచ్చింది. సీసీ కెమెరాల ద్వారా విచారణను న్యాయవాది పరిశీలించవచ్చని అనుమతించింది.
KTR: ఇప్పటికే అధికారులైన దానకిశోర్, అర్వింద్‌కుమార్‌లను ఏసీబీ విచారించింది. వారిచ్చిన వివరాల ఆధారంగానే కేటీఆర్‌కు ప్రశ్నలను సంధించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రశ్నల చిట్టాను ముందుగానే ఏసీబీ రెడీ చేసుకొన్నది. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఇచ్చిన ఆదేశాలపై ప్రధానంగా విచారిస్తారని తెలిసింది.
అరెస్టుపై ఉత్కంఠ?
KTR: విచారణ అనంతరం కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చూపుతారనే అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ అనుమానంతో నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లే ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ మరో కీలక నేత హరీశ్‌రావును గృహనిర్బంధం చేయడంతో అరెస్టు వార్తలకు బలం చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.