Komrelly Mallanna Temple: తెలంగాణలో రెండున్నర నెలలపాటు జరిగే అరుదైన జాతర ఈ ఆదివారం సాయంత్రం నుంచే ప్రారంభంకానున్నది. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలిరానున్నారు. ఈ జాతర మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం (జనవరి 19) నుంచి మొదలై ఉగాది పర్వదినానికి ముందు వచ్చే ఆదివారం ఈ జాతర ముగియనున్నది. ఈ రెండున్నర కాలంలో తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఇక్కడి స్వామివారిని దర్శించుకోనున్నారు.
Komrelly Mallanna Temple: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలో భక్తుల కొంగుబంగారంగా వెలుగుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు. బండ సొరికల్లో వెలిసిన దేవుడిగా భక్తులు కొలుస్తారు. ప్రతి వారం భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకుంటారు. పట్నం (ముగ్గు) వేసి కల్యాణం జరిపించి, మొక్కులు తీర్చుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతోపాటు మరో రెండు వేడుకలు జరుపుతారు. తొలి ఆదివారాన్ని పట్నం ఆదివారంగా భక్తులు పిలుచుకుంటారు.
Komrelly Mallanna Temple: ఇక్కడ జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తారు. హైదరాబాద్ మహానగరం నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ జాతరకు అన్నిరోజులు కలుపుకొని సుమారు 25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Komrelly Mallanna Temple: ఆదివారం పట్నం, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక వద్ద సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండాలు కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకలకు లక్షల మంది తరలివస్తారు. ఈ సారి మార్చి 23వ తేదీన అగ్నిగుండాలు కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు రాత్రి జాగరణ చేసి, కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాలను నిర్వహిస్తారు. అతి కీలకమైన పెద్ద పట్నం ఈసారి ఫిబ్రవరి 2న నిర్వహిస్తారు. మహాశివరాత్రికి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.