Komatireddy Raj Gopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఖాయమంటూ పలుమార్లు ఆయన చెప్పడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల సమయంలో భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆ పార్టీ అధిష్టానం హామీ కూడా ఇచ్చిందని ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కూడా పలుమార్లు ప్రకటించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కూడా తాజా విశ్లేషణల్లో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Komatireddy Raj Gopal Reddy: ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ మంత్రి పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా.. ప్రజల పక్షాన నిలబడతా అని రాజగోపాల్‌రెడ్డి ధీమాగా చెప్పారు. తనకు మాత్రం హోంమంత్రి అంటే ఇష్టమని తన మనసులోని కోరికను బయటపెట్టుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ అంశంపై నిన్న ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరిగినట్టు ఆయన చెప్పారు. తనకు ఇంకా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రాలేదు.. అంటూ రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Raj Gopal Reddy: ఇదిలా ఉండగా, కొన్ని వార్తలు మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనతోపాటు మరో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. దీంతో మరో మంత్రిగా రాజగోపాల్‌రెడ్డిని తీసుకుంటూ ముగ్గురి సామాజికవర్గం ఒకటే అవుతుందని ఇప్పటిదాకా అధిష్టానం తటపటాయించిందని సమాచారం. అయితే ఇదే దశలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి, ఆ స్థానాన్ని రాజగోపాల్‌రెడ్డితో భర్తీ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.