Hijack Alert: విమానం టేకాఫ్‌కి రెడీగా ఉంది.. సీటు బెల్టులు పెట్టుకుని హాయిగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేద్దామనుకుంటున్న టైమ్‌లో ఒక్కసారిగా ‘ఫ్లైట్ హైజాక్’ అంటే ఎవరికైనా గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా! బుధవారం ఉదయం కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విస్తారా ఫ్లైట్‌లో సరిగ్గా ఇలాంటి భయానకమైన సీనే క్రియేట్ అయింది. విమానంలోని టాయిలెట్ అద్దంపై ఎవరో లిప్‌స్టిక్‌తో ‘హైజాక్ హెచ్చరిక’ రాయడంతో క్యాబిన్ సిబ్బంది షాక్ అయ్యారు. క్షణాల వ్యవధిలో ఎయిర్పోర్ట్ మొత్తం ఎమర్జెన్సీ అలర్ట్ మోగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
టేకాఫ్‌కు ముందే కలకలం – లిప్‌స్టిక్‌తో హైజాక్ వార్నింగ్..
అధికారులు వెల్లడించిన పూర్తి వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (NSCBI) నుంచి మహారాష్ట్రలోని ముంబైకి బయల్దేరేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ (AI 2772 / A320) రన్‌వే వైపు కదిలేందుకు సిద్ధమైంది.
ఉదయం దాదాపు 10:37 గంటల సమయంలో క్రూ మెంబర్స్ రొటీన్ చెకప్ చేస్తుండగా.. వాష్‌రూమ్‌లోని అద్దంపై లిప్‌స్టిక్‌తో విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు రాసి ఉన్న సందేశాన్ని చూసి హడలిపోయారు. క్యాబిన్ సిబ్బంది వెంటనే ఫ్లైట్ పైలట్‌కు సమాచారం అందించగా, ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు అత్యవసర ఎమర్జెన్సీ సందేశాన్ని పంపారు.
ఐసోలేషన్ బేకు తరలింపు – రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
హైజాక్ హెచ్చరిక అందిన వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (SOP) ప్రకారం భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. విమానాన్ని వెంటనే ప్రధాన రన్‌వే నుంచి దూరంగా ఉన్న ‘ఐసోలేషన్ బే’కు తరలించారు.
విమానంలో ఉన్న 147 మంది ప్రయాణికులను, సిబ్బందిని అత్యంత జాగ్రత్తగా కిందకు దించి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. సీఐఎస్ఎఫ్ (CISF), విమానాశ్రయ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది రంగంలోకి దిగి విమానం నలుమూలలా జల్లెడ పట్టారు. ప్రయాణికుల లగేజీతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఆకతాయిల పనా? లేక సీరియస్ బెదిరింపా?
ఇటీవల కాలంలో దేశీయ విమానాలకు నకిలీ (Hoax) బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనలోనూ అద్దంపై లిప్‌స్టిక్‌తో రాసిన ఆ రాతలు ఎవరివి? ఫ్లైట్ ఎక్కిన ప్యాసింజర్స్ లోనే ఎవరైనా కావాలని చేసిన ప్రాంక్ లేదా ఆకతాయి చేష్టలా? లేక నిజమైన ముప్పు ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
టాయిలెట్ వైపు వెళ్లిన ప్రయాణికుల వివరాలు, హ్యాండ్ బ్యాగేజీలను అధికారులు రీ-చెక్ చేస్తున్నారు. ప్రాథమికంగా ఎలాంటి అనుమానాస్పద పేలుడు పదార్థాలు లభించలేదని సమాచారం. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు.
