Priya Bhavani Shankar: సౌత్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి జోరుగా సాగుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన అందాల నటి ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఓ ఇంటివారయ్యారు. గత పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న తన కాలేజీ స్నేహితుడు, ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌తో కలిసి ఆమె నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 11న ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతుండగా అభిమానులు, సినీ తారలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాలేజీ నాటి స్నేహం.. పదేళ్ల ప్రేమ ప్రయాణం..
ప్రియా భవానీ శంకర్, రాజ్‌వేల్ రాజ్ ఇద్దరూ ఇంజినీరింగ్ కాలేజీ రోజుల నుంచే ప్రాణ స్నేహితులు. 18 ఏళ్ల వయసులోనే మొదలైన వీరి పరిచయం కాలక్రమంలో ప్రేమగా మారింది. సుమారు పదేళ్ల పాటు సాగిన ఈ రిలేషన్‌షిప్‌ను వారు ఎప్పుడూ దాచలేదు. గతంలోనే ప్రియ తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశారు. ఇద్దరూ కలిసి చెన్నైలో ఓ కలల ఇంటిని కూడా నిర్మించుకున్నారు. దీపావళి వేళ నవంబర్ 10న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, మరుసటి రోజే పెద్దల ఆశీస్సులతో ఒక్కటయ్యారు.
వరుడు రాజ్‌వేల్ రాజ్ బ్యాక్‌గ్రౌండ్..
ప్రియను పెళ్లాడిన రాజ్ ఫైనాన్స్ రంగానికి చెందిన ప్రొఫెషనల్.. కార్పొరేట్ ఫైనాన్స్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కు ఫిట్నెస్, ట్రావెలింగ్ అంటే అమితమైన ఆసక్తి. ఆయన మార్షల్ ఆర్ట్స్ ఔత్సాహికుడు కూడా. థాయిలాండ్‌లో ప్రత్యేకంగా ‘మాయ్ థాయ్’ (Muay Thai) యుద్ధ విద్యలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకున్నారు.
న్యూస్ రీడర్ నుంచి స్టార్ హీరోయిన్గా..
టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజెంటర్‌గా, సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్, తన ప్రతిభతో వెండితెరకు ఎదిగారు. తమిళంలో అగ్ర హీరోల చిత్రాల్లో నటించి క్రేజ్ సంపాదించారు. కమల్ హాసన్ భారీ చిత్రం ‘భారతీయుడు 2’ లో ఆమె కీలక పాత్ర పోషించారు.తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కల్యాణం కమనీయం’తో ఎంట్రీ ఇచ్చి, నాగచైతన్య సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘దూత’లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మెప్పించారు. ఇటీవల రవితేజ–శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో ‘కావేరి’ పాత్రలో అద్భుత నటనతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆమె చేతిలో డెమోంటే కాలనీ 3, మరగద నాణెం 2, ఇండియన్ 3 వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
2026లో సినీ తారల పెళ్లిళ్ల జోరు..
ఈ ఏడాది సినీ పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న తమ దీర్ఘకాల బంధాన్ని పెళ్లితో సర్ప్రైజ్ చేయగా, అల్లు శిరీష్ – నయానికా రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ ప్రేయసిలతో ఏడడుగులు వేశారు.
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం వివాహం చేసుకోగా, సాయిధరమ్ తేజ్, తేజ సజ్జ వచ్చే డిసెంబర్లో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.మరోవైపు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్ పెళ్లి వేడుక గ్రీస్‌లో జరగడం కూడా ట్రెండింగ్‌గా మారింది.
