Khairatabad Ganesh: భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకల ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ బడా గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది భక్తులకు 69 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా దివ్య దర్శనమిచ్చిన లంబోదరుడి నిమజ్జన ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రశాంతంగా పూర్తయింది. వేలాది మంది భక్తులు “గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ” అంటూ నినదిస్తూ భక్తిపారవశ్యం, భావోద్వేగాల నడుమ స్వామివారికి వీడ్కోలు పలికారు.
శోభాయాత్ర – నిమజ్జనం సాగిందిలా..
టస్కర్‌పై విగ్రహాన్ని అధిష్టింపజేసి వెల్డింగ్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ముందుకు కదిలింది. శోభాయాత్ర ప్రారంభ సమయంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ టస్కర్ ఎదుట కొబ్బరికాయ కొట్టి, డప్పు చప్పుళ్లకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
మండపం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా భారీ జనసందోహం నడుమ ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది.
క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం..
ఎన్టీఆర్ మార్గ్ వద్దకు మహాగణపతి చేరగానే ఉత్సవ సమితి సభ్యులు, పూజారులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్ నంబర్ 4 సాయంతో పకడ్బందీగా మధ్యాహ్నం 2:15 గంటలకు విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ జలాల్లో నిమజ్జనం చేశారు.
కిక్కిరిసిన ట్యాంక్‌బండ్ – మార్మోగిన భాగ్యనగరం..
ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వేలాది వినాయక విగ్రహాల శోభాయాత్రలతో హైదరాబాద్ పురవీధులు భక్తి నినాదాలు, బాజాభజంత్రీలతో మార్మోగుతున్నాయి.
