Viral News

Viral News: దేవుడికి భక్తుడి వింత కోరిక.. లెటర్ చూస్తే షాక్ ఆవలిసిందే..!

Viral News: సాధారణంగా ఆలయాలకు వెళ్లే భక్తులు తమ ఆరోగ్యం బాగుండాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, లేదా ఉద్యోగం, పెళ్లిళ్లు కుదరాలని కోరుకుంటూ హుండీలో కానుకలతో పాటు మొక్కుబడుల చీటీలు వేస్తుంటారు. అయితే కర్ణాటకలోని ప్రసిద్ధ శక్తిపీఠంలో ఓ భక్తుడు అమ్మవారికి సమర్పించిన వింత కోరిక చూసి ఆలయ సిబ్బందితో పాటు నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఇంట్లోని నల్లుల బాధ భరించలేక.. వాటి నుంచి విముక్తి కల్పించాలంటూ ఏకంగా గ్రామదేవత ఎల్లమ్మ తల్లినే వేడుకున్నాడు.

అసలేం జరిగింది? హుండీ లెక్కింపులో దొరికిన లేఖ..

ఉత్తర కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సవదత్తి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది హుండీ లెక్కింపు చేపట్టారు.

భక్తులు సమర్పించిన నోట్లు, నాణేలను లెక్కిస్తున్న క్రమంలో ఒక కాగితం మడత పెట్టి కనిపించింది. దాన్ని తెరిచి చూసిన సిబ్బందికి ఆశ్చర్యంతో పాటు నవ్వు ఆగలేదు. ఆ చీటీలో భక్తుడు తన ఆవేదనను ఇలా రాసుకొచ్చాడు.

అమ్మా తల్లీ ఎల్లమ్మ దేవీ.. మా ఇంట్లో నల్లుల బాధ విపరీతంగా పెరిగిపోయింది. దయచేసి ఆ నల్లులన్నీ మా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేలా చెయ్యి తల్లీ. నా ఈ కోరిక నెరవేరితే మళ్లీ నీ ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా పండ్లు, కాయలు సమర్పించి పూజలు చేసుకుంటాను.

నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ లెటర్..

ఈ లేఖను చూసిన ఆలయ సిబ్బంది ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

పాపం.. ఆ భక్తుడికి నిద్రలేకుండా నల్లులు ఎంత కష్టం తెచ్చిపెట్టాయో అంటూ కొందరు సానుభూతితో సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అమ్మవారి దగ్గరకు ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని ఇప్పుడే తెలిసింది.. ఏదేమైనా భక్తుడి అమాయకత్వం, నమ్మకం బాగుంది అంటూ మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఎల్లమ్మ ఆలయానికి రూ.2.69 కోట్ల కానుకలు..

ఇదిలా ఉండగా, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లే సవదత్తి ఎల్లమ్మ ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.

భక్తులు సమర్పించిన హుండీ కానుకలు, నగదును లెక్కించడానికి సిబ్బందికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది. ఈసారి హుండీల ద్వారా అమ్మవారికి మొత్తం రూ. 2.69 కోట్ల మేర నగదు కానుకలు సమకూరినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *