House Arrest: ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా కౌంటింగ్ ప్రక్రియ సాధారణంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పలువురు కీలక నేతలు, ప్రజాప్రతినిధులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నందికొట్కూరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవగా, పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. సిద్ధార్థ్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాగానే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నందికొట్కూరు పరిసరాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పోలింగ్ రోజు కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనల ప్రకారం పాస్లు ఉన్న ఏజెంట్లను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తూ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
