AP ZPTC & MPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8:00 గంటలకు పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి, మూడంచెల భద్రత నడుమ లెక్కింపు కొనసాగిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా, అనంతరం బ్యాలెట్ బాక్సుల నుంచి సాధారణ ఓట్ల లెక్కింపు మొదలైంది. రాత్రి 8 గంటల లోపు పూర్తి ఫలితాలను వెల్లడించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
బరిలో వేలాది మంది అభ్యర్థులు: పూర్తి గణాంకాలు
-
జడ్పీటీసీ స్థానాల లెక్క: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 స్థానాలకు గాను ఇప్పటికే 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 2,169 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు (వైసీపీ: 574, టీడీపీ: 452, జనసేన: 109, బీజేపీ: 34, ఇతరులు/స్వతంత్రులు: 1,000 మంది).
-
ఎంపీటీసీ స్థానాల లెక్క: మొత్తం 9,821 స్థానాలకు 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా, 3 చోట్ల నామినేషన్లు రాలేదు. దీంతో మిగిలిన 7,767 స్థానాలకు 18,844 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు (వైసీపీ: 7,622, టీడీపీ: 6,342, జనసేన: 1,499, బీజేపీ: 280, ఇతరులు/స్వతంత్రులు: 3,101 మంది).
-
సిబ్బంది: 28 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో 11 వేల మందికి పైగా సూపర్వైజర్లు, 28,500 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
ప్రారంభ ట్రెండ్స్ & పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు..
-
కలికిరి (అన్నమయ్య జిల్లా): కలికిరి పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థి భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. మొత్తం 178 ఓట్లలో టీడీపీకి 153 రాగా, వైసీపీకి 24 ఓట్లు దక్కాయి.
-
గాలివీడు (అన్నమయ్య జిల్లా): గాలివీడు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థికి 122 ఓట్లు రాగా, స్వతంత్రులకు 8, బీఎస్పీకి 3, నోటాకు 3 ఓట్లు వచ్చాయి. 6 ఓట్లు చెల్లనివిగా తేలాయి.
-
రేణిగుంట (తిరుపతి జిల్లా): పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. బీజేపీకి 68 ఓట్లు, వైసీపీకి 55, నోటాకు 5 ఓట్లు వచ్చాయి.
-
మచిలీపట్నం నార్త్ & సౌత్ (కృష్ణా జిల్లా): మచిలీపట్నం పరిధిలోని పలు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ముందంజలో నిలిచారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆసక్తికర ఘటనలు & ఉద్రిక్తతలు..
-
ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) వద్ద ఉద్రిక్తత: కొటికలపూడి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి పోలైన ఓట్లకు, బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఓట్లకు తేడా రావడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 2,432 ఓట్లు పోల్ అయినట్లు రికార్డుల్లో ఉండగా, బాక్స్‌లో 2,427 ఓట్లు మాత్రమే ఉన్నాయని గుర్తించడంతో అధికారులను ప్రశ్నించారు.
-
బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు (నరసరావుపేట): ఏఎంరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులను తెరవగా ఓట్లతో పాటు కరపత్రాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి వెళ్లే రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి వద్దని, ప్రధాన రహదారికి కలిసేలా ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు బ్యాలెట్ బాక్సుల ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లకు విజ్ఞప్తి చేశారు.
-
తిరుపతిలో ముఖాముఖి: తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానంలో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు హర్షిత్ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ తరఫున ధనలక్ష్మి బరిలో నిలిచారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు ఒకేసారి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడంతో సందడి నెలకొంది.
జిల్లా కేంద్రాల నుంచి రౌండ్ల వారీగా సాధారణ బ్యాలెట్ పత్రాల లెక్కింపు వేగవంతమైంది. మధ్యాహ్నం నాటికి మెజారిటీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాలు వెలువడనున్నాయి.
