Karnataka Cabinet Reshuffle: కర్ణాటక రాజకీయాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి డికే శివకుమార్ మంత్రివర్గ విస్తరణకు (Cabinet Expansion) ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. మంత్రి పదవుల రేసులో ఉన్న అభ్యర్థుల తుది జాబితాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ఆమోద ముద్ర వేశారు.
దీంతో పాటు, కర్ణాటక శాసనసభ తదుపరి స్పీకర్‌గా జీఎస్ పాటిల్ పేరును కూడా అధిష్టానం ఖరారు చేసింది.
అధిష్టానం ఆమోదించిన 20 మంది కొత్త మంత్రుల జాబితా ఇదే..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల భేటీ అనంతరం ఈ 20 మంది పేర్లతో కూడిన జాబితాను సీఎం డికే శివకుమార్‌కు పంపించారు. రాజ్ భవన్ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి ఈ జాబితాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు సమర్పించగా, నేడు సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
కొత్త మంత్రుల పూర్తి వివరాలు:
-
పి.ఎం. నరేంద్రస్వామి
-
శివరాజ్ తంగడగి
-
రుద్రప్ప లమాణి
-
కే.ఎస్. బసవంతప్ప
-
బి. నాగేంద్ర
-
టి. రఘుమూర్తి
-
బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్
-
రిజ్వాన్ అర్షద్
-
సంతోష్ లాడ్
-
మధు బంగారప్ప
-
పుట్టరంగశెట్టి
-
మంకాల్ వైద్య
-
డాక్టర్ అజయ్ సింగ్
-
ఎన్. చలువరాయ స్వామి
-
కే.ఎం. శివలింగే గౌడ
-
హెచ్.సి. బాలకృష్ణ
-
శ్రీమతి గాయత్రి శాంతేగౌడ
-
బసవరాజ్ రాయరెడ్డి
-
విజయానంద్ కాశప్పనవర్
-
లక్ష్మణ్ సవది
శాసనసభ, మండలిలోని ఇతర పదవులు..
మంత్రివర్గ విస్తరణతో పాటు చట్టసభలకు సంబంధించి పలు కీలక పదవులను కూడా అధిష్టానం ప్రకటించింది..
-
శాసనసభ స్పీకర్: జీఎస్ పాటిల్ (గతంలో స్పీకర్‌గా ఉన్న యు.టి. ఖాదర్ జూన్‌లో డికే శివకుమార్ కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేరడంతో ఈ పదవి ఖాళీ అయింది).
-
శాసనసభ డిప్యూటీ స్పీకర్: ఎ.ఎస్. పొన్నన్న
-
శాసనమండలి ఛైర్మన్: సలీమ్ అహ్మద్
-
శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్: శ్రీమతి ఉమాశ్రీ
సామాజిక సమతుల్యతకే ప్రాధాన్యత!
కర్ణాటకలో జూన్ 3న డికే శివకుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ కేబినెట్ విస్తరణపై సుదీర్ఘ చర్చలు సాగాయి. రాష్ట్రంలో గరిష్టంగా 34 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 14 మంది మాత్రమే ఉండటంతో మిగిలిన 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
కులం, మతం,ఇంకా ప్రాంతీయ సమీకరణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, బీకే హరిప్రసాద్ తదితర సీనియర్ నేతలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సమతుల్య జాబితాను రూపొందించినట్లు సమాచారం.
