Kandula Durgesh

Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు

Kandula Durgesh: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసును కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాల పంచాయతీగా మార్చాలని చూడటం అత్యంత విచారకరమని ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం మొదటి నుంచీ పూర్తి చట్టపరంగా ఇంకా పారదర్శకంగా ముందుకు వెళ్తోందని, ఇందులో భాగంగానే ప్రత్యేక సిట్ (SIT) బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరి కేవలం ‘గురివింద గింజ’ చందంగా మారిందని, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇలా ఉంటే, ఏమాత్రం సంబంధం లేని అంశాలకు కులం రంగు పులిమి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. వైసిపి నేతలకు ఈ కేసు దర్యాప్తుపై నిజంగా ఏవైనా సందేహాలు లేదా అనుమానాలు ఉంటే నేరుగా సమావేశం ఏర్పాటు చేసుకుని నివృత్తి చేసుకోవాలే తప్ప, ఇలాంటి సున్నితమైన అంశాలను వాడుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ప్రతి చిన్న విషయానికి కులాలను ప్రస్తావిస్తూ పొలిటికల్ మైలేజ్ పొందడమే లక్ష్యంగా వైసిపి రాజకీయం చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సైతం ఈ వివాదంలోకి లాగుతూ, ఆయనను ఒక కులం చట్రంలో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఒక అగ్రనేతను ఇలా సంకుచిత పరిధిలోకి నెట్టాలని చూడటం సరికాదని హితవు పలికారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు తీసేసి ఆ వర్గానికి అన్యాయం చేసింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా అని మంత్రి ఈ సందర్భంగా నిలదీశారు. ఏ కులానికి చెందిన నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడితే, వెంటనే అదే కులానికి చెందిన తమ పార్టీ నేతలను అడ్డం పెట్టుకుని వారితో తిట్టించడం వైసిపికి మొదటి నుండి అలవాటుగా మారిన ఒక దుర్మార్గపు విధానమని దుయ్యబట్టారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితులు ఎంతటి వారైనా సరే శిక్ష పడటం ఖాయమని స్పష్టం చేస్తూ, శవ రాజకీయాలు ఆపి బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ప్రతిపక్ష నేతలను మంత్రి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *