KAMAL HASSAN: ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగానే తగ్గించినట్లు కమలహాసన్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి సంబరాలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల చిత్ర ప్రచారంతో సంబంధించి కమలహాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు, త్రిష వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కమల్ మాట్లాడుతూ –
థగ్ లైఫ్ అనేది కేవలం యాక్షన్ కథ కాదు. ఇది అనేక భావోద్వేగాల మేళవింపుతో కూడిన చిత్రం. చిత్ర బృందం ఎంతో నిబద్ధతతో, కష్టపడి పనిచేసింది. ఈ సినిమా ప్రజల్లో మంచి స్పందన పొందాలి అని ఆశిస్తున్నాను,” అని చెప్పారు.
అయితే ప్రస్తుతం దేశంలో ఆపరేషన్ సిందూర్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కమల్ అన్నారు.
“ఇలాంటి సమయంలో సినిమా ఈవెంట్లను పెద్దగా నిర్వహించడం తగదు. అందుకే మేము చాలా కార్యక్రమాలను వాయిదా వేసుకున్నాం. ఇది బాధ్యతాయుత నిర్ణయం,” అని ఆయన స్పష్టం చేశారు. ఇంతేకాదు, త్వరలోనే తాను కశ్మీర్‌లోని పహల్గామ్ కి పర్యటనకు వెళ్లనున్నట్లు కమలహాసన్ తెలిపారు.
“పహల్గామ్ కూడా మనదేశంలోని భాగమే. అక్కడ పర్యాటకులను ప్రోత్సహించడం మన బాధ్యత. వారికి ధైర్యం చెప్పడం, భరోసా కల్పించడం కోసం నేను అక్కడికి వెళతాను. దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే ఇప్పటివరకు నడుస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.