Ponnam Prabhakar

Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి

Ponnam Prabhakar: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘నవ నిర్మాణ సభ’ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు.

కోనసీమ చెట్లు ఎండిపోతున్నాయన్న చరిత్ర మీది కాదా?

గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ప్రజలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలంగాణ ఏర్పడితే 11 రోజుల పాటు అన్నం తినడం మానేశానని బహిరంగంగా చెప్పుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ‘తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి’ అంటూ మనపై విషం కక్కిన చరిత్ర ఆయనది. అలాంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పకుండా ఇక్కడ సభ ఎలా నిర్వహిస్తారు?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఇక్కడ రాజకీయ సభలు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే తీవ్రంగా ఆక్షేపిస్తామని స్పష్టం చేశారు.

ఘాటైన సామెతలతో కౌంటర్.. “ఆంధ్రాలో చూపించుకోండి!

పవన్ కళ్యాణ్‌ రాజకీయ వైఖరిని ఎండగట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని ఘాటైన తెలంగాణ సామెతలను ప్రస్తావించారు:

కన్నతల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి వడ్డాణం చేయిస్తాడన్నట్లు ఉంది పవన్ వ్యవహారం.కుట్ల రాయి తీయలేని వాడు.. ఎట్లా రాయి తీస్తాడా? అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది.

ఏపీ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి అక్కడ అధికారం ఇచ్చారు. మీ నవనిర్మాణం ఏదో ఉంటే ఆంధ్రాలో చూపించుకోవాలి కానీ, తెలంగాణలో ఎందుకు?” అని పొన్నం నిలదీశారు. ప్రశాంతమైన హైదరాబాద్ వాతావరణాన్ని కలుషితం చేయడానికే పవన్ ఈ కొత్త నటనను ప్రారంభించారని విమర్శించారు.

కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చెయ్.. పవన్‌కు సవాల్!

హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెట్టడం వెనుక కేవలం బీజేపీ ఎజెండా మాత్రమే దాగి ఉందని మంత్రి ఆరోపించారు. “మీ బాస్ నరేంద్ర మోదీని మెప్పించడానికే ఈ సభలు పెడుతున్నారా? బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే పవన్ స్థాపించే నవనిర్మాణమా?” అని దుయ్యబట్టారు.

అంతేకాకుండా.. “బీజేపీ ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలేదు. నా మాట తప్పైతే కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ ప్రమాణం చేసి చెప్పాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన సవాల్ విసిరారు. తెలంగాణ రక్తం ఉన్న, ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్క బిడ్డ కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించే ఈ సభకు వెళ్లరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *