Kalvakuntla Kavitha: తెలంగాణ శాసనసభలో తన కుటుంబ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ‘X’ (ట్విట్టర్) వేదికగా సీఎం వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్లో తాను చూపించిన ఆస్తుల కంటే ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు నిరూపించినా, ఆ భూమిని ప్రభుత్వానికే ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చదివిన లెక్కలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసిన కవిత.. అసలు నిజాలు తేలాలంటే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నా ఎన్నికల అఫిడవిట్టే ప్రామాణికం – గజం ఉన్నా ఇచ్చేస్తా
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడెక్కడో భూములు ఉన్నట్లు అసత్యాలు ప్రచారం చేశారని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలను మించి, ఎన్నికల అఫిడవిట్లో తాను వెల్లడించిన ఆస్తుల కన్నా ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నట్లు చూపించినా నిస్సంకోచంగా ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.
ఈ సీఎంపై మాకు నమ్మకం లేదు – సీబీఐ ఎంక్వైరీ వేయండి..
ముఖ్యమంత్రిపై తమకు ఎలాంటి విశ్వాసం లేదని, ఆయన ప్రస్తావించిన భూముల వివరాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరగాలంటే సీబీఐ విచారణే ఏకైక మార్గమని డిమాండ్ చేశారు. “గుంపు మేస్త్రీ – గుంటనక్క ముమ్మాటికీ కలిసే ఉన్నారని మరోసారి రుజువైంది” అంటూ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం గూఢచారితో పాటు పలువురి భూములపై విచారణ చేయాలని కోరారు.
వీరందరి ఆస్తులపైనా విచారణ జరపాలి..
సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించిన వారితో పాటు ఇతర ప్రముఖుల భూములపై కూడా సీబీఐ దర్యాప్తు జరగాలని కవిత లిస్ట్ బయటపెట్టారు.
-
మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి
-
వ్యాపారవేత్త రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు
-
పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి
-
నవీన్ రావు, కొండల్ రావు
ఈ నేతలందరి భూముల వివరాలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి, అసలు వాస్తవాలను ప్రజల ముందుంచాలని కవిత డిమాండ్ చేశారు..
