Kavitha: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి ఆమె నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చాలా చిన్నచూపు చూస్తోందని, అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. తెలంగాణ రైతులు పడుతున్న బాధలు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే తాము సచివాలయం ఎదుట ధర్నాకు దిగినట్లు కవిత స్పష్టం చేశారు.
గడిచిన రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై ఒక్కసారి కూడా సమీక్షా సమావేశం నిర్వహించలేదని కవిత ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కల్లాల్లోనే ఉండిపోయిన వరి ధాన్యంతో పాటు జొన్నలను కూడా ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల నుంచి ప్రతి గింజా కొనేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
సచివాలయం వంటి అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో కవిత ధర్నాకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు ఆమె పార్టీకి చెందిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పోలీసు వాహనాల్లో ఎక్కించి ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవిత అరెస్ట్ సమాచారం తెలియడంతో ఆమె మద్దతుదారులు, పార్టీ శ్రేణులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
