Missing Case

Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!

Missing Case: కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన బీటెక్‌ విద్యార్థి రాహుల్‌ ఘటన విషాదంతంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులను, పోలీసులను ఆందోళనకు గురిచేసిన ఈ మిస్సింగ్ కేసు చివరకు ఆత్మహత్యగా తేలింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి రాహుల్ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.

టూర్‌కు వెళ్తున్నానని చెప్పి..

పోలీసులు ఇంకా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ బీటెక్ చదువుతున్నాడు. గత నెల 27న తాను ఒక చిన్న టూర్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి రాహుల్ ఇంటి నుంచి బయలుదేరాడు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అతను.. అక్కడ తిరువనంతపురం వెళ్లే ‘శబరి ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కాడు.

అయితే, రైలు ఎక్కిన కొంతసమయం తర్వాత రాహుల్ మొబైల్ స్విచ్ఛాప్ అవ్వడంతో పాటు అతని జాడ తెలియకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాచిగూడ రైల్వే పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.

బావిలో లభ్యమైన మృతదేహం:

తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ పరిధిలో ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న బావిలో ఓ యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా.. అది కాచిగూడ నుండి అదృశ్యమైన విద్యార్థి రాహుల్‌దేనని ఆధారాల ద్వారా ధృవీకరించారు. రాహుల్ మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు:

ఉన్నత చదువులు చదువుకుంటూ భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు, ఇలా శవమై కనిపించడంతో రాహుల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాహుల్ అదృశ్యం ఇంకా ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అతను ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *