Janwada Farmhouse

Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ప్రదీప్ రెడ్డి

Janwada Farmhouse: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న జన్వాడ ఫామ్‌హౌస్ వివాదంపై ఆ ఆస్తి యజమాని ప్రదీప్ రెడ్డి అధికారికంగా స్పష్టతనిచ్చారు. జన్వాడలోని ఫామ్‌హౌస్, ఆ భూమి పూర్తిగా తన సొంత ఆస్తి అని, దానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడని, ఆ చనువుతోనే తన సొంత ప్రాపర్టీని ఆయనకు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తారన్న ప్రచారం, పరిశీలనకు వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

2019లో కొనుగోలు చేశా – లీగల్ టైటిల్ నా పేరిటే ఉంది..

తాను 2019లోనే ఈ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఈ భూములకు సంబంధించి ఎలాంటి భూవివాదాలు లేవని, చట్టబద్ధమైన స్పష్టమైన లీగల్ టైటిల్ డాక్యుమెంట్లు తన పేరిట ఉన్నాయని స్పష్టం చేశారు. కేటీఆర్ కేవలం లీజుదారుడు మాత్రమేనని వివరించారు.

ప్రైవేట్ ఆస్తిపై రాజకీయాలేంటి?
ఓ వ్యక్తిగత ప్రైవేట్ ఆస్తి వద్దకు రాజకీయ పార్టీల నేతలు వచ్చి పరిశీలిస్తామనడం, ముట్టడికి యత్నించడం ఎంతమాత్రం సరికాదని ప్రదీప్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ ఆస్తిని అనవసరంగా రాజకీయ వివాదంగా మార్చవద్దని హితవు పలికారు.

నోటీసులు ఇస్తే అధికారులకు పత్రాలు ఇస్తా..

ప్రభుత్వానికి గానీ, సంబంధిత అధికారులకు గానీ ఈ భూములపై ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా తనకు నోటీసులు జారీ చేయవచ్చని తెలిపారు. అధికారులు ఏ సమాచారం, ఏ పత్రాలు కోరినా చట్టబద్ధమైన ప్రక్రియలో సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తేల్చిచెప్పారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్‌హౌస్‌పై పరోక్ష ఆరోపణలు చేయగా, కాంగ్రెస్ నాయకులు ఆ భూములను పరిశీలిస్తామని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి ఉద్రిక్తతలు చెలరేగకముందే యజమాని ప్రదీప్ రెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి లీజు పత్రాల వివరాలను వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *