Danam Nagender

Danam Nagender: ఎన్నికలు వస్తే పోరాటం చేస్తా.. కోర్టుకు వెళ్లను

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పునిచ్చిన నేపథ్యంలో దానం నాగేందర్ మొదటిసారి స్పందించారు. తీర్పు అనంతరం మీడియాతో నిర్వహించిన అనధికారిక చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్పుపై పైకోర్టును ఆశ్రయించబోనని స్పష్టం చేసిన దానం, ఉపఎన్నిక వస్తే ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కోర్టుకు వెళ్లను – ప్రజల్లోనే తేల్చుకుంటా..
“హైకోర్టు ఆర్డర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా. ఈ తీర్పుపై నేను పైకోర్టులకు వెళ్లి అప్పీల్ చేసుకోను. ఒకవేళ ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తే నేరుగా రంగంలోకి దిగి కొట్లాడతాను, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని దానం స్పష్టం చేశారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నానని, సరైన సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.
తీర్పు తర్వాత దానం నివాసం వద్ద పరిణామాలు..
హైకోర్టు తీర్పు వెలువడే సమయానికి అసెంబ్లీ నుంచి ఇంటికి చేరుకున్న దానం దాదాపు రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. అయితే, ఆయన నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు గానీ, ముఖ్య అనుచరులు గానీ పెద్దగా రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే ఆయన్ను పరామర్శించేందుకు వచ్చారు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోగా, బీజేపీ నేతలు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లోని కొందరు స్థానిక అసంతృప్త నేతల్లోనూ ఈ పరిణామం ఊరటనిచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వస్తే దానం పరిస్థితేంటి?..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానం ఆ పార్టీలో చేరినప్పటికీ, పార్టీ స్థానిక కేడర్ పూర్తిగా ఆయన వెంట నడవలేదన్న విమర్శలు ఉన్నాయి. పైగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లోనే దానం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, అనర్హులకు ఇళ్ల కేటాయింపులు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి గళం వినిపించారు.

పార్టీ మారే సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలను సంప్రదించకపోవడం వల్ల చాలామంది బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఆయనతో కాంగ్రెస్‌లోకి రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి రద్దయి ఉపఎన్నిక అనివార్యమైతే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పాత అనుచరులు ఆయనకు ఏ మేరకు అండగా నిలుస్తారనేది ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *