Jannik Sinner: టెన్నిస్ ప్రపంచంలో మరో తార దూసుకొచ్చింది. ఇప్పటికే టెన్నిస్ నుంచి రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ వీడ్కోలు పలకగా.. సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా త్వరలోనే వీరి బాటలో నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టెన్నిస్ కొత్త స్టార్ తానే నంటూ ఇటలీ ప్లేయర్ , ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ యానిక్ సినెర్ దూసుకొస్తున్నాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా తన ఆధిపత్యాన్ని చాటేందుకు అడుగులు వేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Rafael Nadal: స్పెయిన్ బుల్ పైనే అందరి దృష్టి.. డేవిస్ కప్ బరిలో నడాల్ దిగుతాడా..? లేదా..?
Jannik Sinner: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏటీపీ ఫైనల్స్‌లో ఇటలీ స్టార్ ప్లేయర్ యానిక్ సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. సొంతగడ్డపై ఈ టెన్నిస్ స్టార్ అదరగొట్టాడు. అమెరికా ప్లేయర్, యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో వరుస సెట్లలో గెలుపొందాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ తుది సమరంలో సినెర్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. మరోవైపు ఫ్రిట్జ్ 8 ఏస్‌లు సంధించి, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సినెర్… 1986లో ఇవాన్ లెండిల్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత అందుకున్నాడు.టోర్నీ విజేతగా నిలిచిన సినెర్ కు రూ. 41 కోట్ల 20 లక్షల ప్రైజ్ మనీతో పాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. దీంతో టెన్నిస్ ప్రపంచంలో తన ఆధిపత్యం మొదలైందని ఘనంగా చాటాడు.