Janhvi Kapoor: తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, ఏఐ (AI) డీప్‌ఫేక్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వాడుతున్నారంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని ధర్మాసనం.. అసభ్యకరమైన కంటెంట్‌ను, వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తున్న పోస్టులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. అయితే, ఇదే సమయంలో ఫ్యాన్ పేజీల విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
4,000 యూఆర్‌ఎల్‌లు – కోర్టు సంధించిన ఆసక్తికర ప్రశ్నలు!
జాన్వీ కపూర్ తరఫు న్యాయవాది దాదాపు 4,000 కు పైగా అభ్యంతరకర లింకులను (URLs) కోర్టుకు సమర్పించారు. వీటిలో కొన్ని ఫ్యాన్ పేజీలు కూడా ఉండటాన్ని గమనించిన న్యాయమూర్తి, జాన్వీ లాయర్‌ను ఉద్దేశించి ఆసక్తికర ప్రశ్నలు సంధించారు:
అసభ్యకరమైన డీప్‌ఫేక్ కంటెంట్ ప్రచారం చేయడం, సెలబ్రిటీ పేరు వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించడం తప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్ని ఫ్యాన్ క్లబ్‌లను, పేజీలను ఎలా మూసివేయగలరు? మీకు అభిమానులు వద్దారా? సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు పొగడ్తలతో పాటు విమర్శలు కూడా వస్తాయి. అభిమానులు నటుల పనిని మెచ్చుకోవచ్చు, సినిమాల అప్‌డేట్స్ పంచుకోవచ్చు. పర్సనాలిటీ రైట్స్ పేరుతో పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై హద్దులు గీయలేం. అన్ని ఫ్యాన్ పేజీలను నేరపూరితమైనవిగా పరిగణించలేం.— జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని
కొందరు ప్రముఖులు పర్సనాలిటీ రైట్స్ పేరుతో తమ తప్పులను దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దానికి కోర్టులు అనుమతించవని స్పష్టం చేశారు.
డీప్‌ఫేక్ ముప్పు – విడదీసి సమర్పించాలని ఆదేశం!
మెటా (Meta) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జాన్వీ కపూర్ ఇచ్చిన 4,000 యూఆర్‌ఎల్‌లలో కొన్ని కేవలం సాధారణ ఫ్యాన్ పోస్టులు మాత్రమే ఉన్నాయని, అంతా అభ్యంతరకరంగా లేదని కోర్టుకు తెలిపారు. దీంతో.. అసభ్యకరమైన కంటెంట్, ఏఐ డీప్‌ఫేక్స్, వాణిజ్యపరమైన దుర్వినియోగం మరియు సాధారణ ఫ్యాన్ పేజీలను స్పష్టమైన వర్గాలుగా విభజించి మళ్లీ జాబితా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు బాలీవుడ్ నుంచి ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖులు తమ పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
