Jai Kottu

Jai Kottu: ‘జై కొట్టు’ పేరుతో యూత్ వింగ్ ప్రారంభం.. పిఠాపురంలో లోగో, థమన్ స్పెషల్ సాంగ్

Jai Kottu: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేచింది. పార్టీలో యువతను క్రియాశీలక భాగస్వాములను చేస్తూ, భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగాన్ని (Youth Wing) అధికారికంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ‘జై కొట్టు’ అధికారిక లోగోతో పాటు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు.

థమన్ స్వరాలు – పవన్ కళ్యాణ్ ఆడియో సందేశం..

జనసేన యువజన విభాగం కోసం రూపొందించిన ‘జై కొట్టు’ నేపథ్య గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ అదిరిపోయే బాణీలు అందించారు. ఈ పాట విడుదలైన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఆడియో సందేశం..
ప్రస్తుతం భుజం చికిత్స నిమిత్తం కేరళలో ఆయుర్వేద విశ్రాంతిలో ఉన్న పవన్ కళ్యాణ్, ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఆడియో సందేశాన్ని పంపించారు. యువత క్రమశిక్షణతో కూడిన ప్రజాస్వామ్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
“అరుపులు, కేకలు కాదు.. క్రమశిక్షణ ముఖ్యం” – మంత్రి నాదెండ్ల మనోహర్..
‘చెయ్యెత్తి జై కొట్టు’ నినాదం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరుస్తుందని, ఆ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ ఈ వేదికను సిద్ధం చేశారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో యువతకు సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమని, అయితే అరుపులు కేకల కంటే అధినేత ఆదేశాలను పాటించే క్రమశిక్షణే ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు.
గత రెండు మూడు నెలలుగా పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. ఆయన ఎక్కడున్నా నిరంతరం ప్రజా సమస్యలు, గ్రామాల అభివృద్ధిపైనే ఆలోచిస్తున్నారని నాదెండ్ల తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఢీకొట్టి 100% స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయంలో జనసేన కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసైనికులు ఇదే ఉత్సాహంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, యువత తరలివచ్చి పార్టీ కార్యకలాపాల్లో సరికొత్త జోష్ నింపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *