konda sureka

Konda Surekha:తాడో పేడో తేల్చుకుంటా.. నాపై కాదు, ముందు సీఎంపై చర్యలు తీసుకోండి

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పతాకస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీలోనే మకాం వేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చిస్తుండగా.. అటు మంత్రి కొండా సురేఖ ఏమాత్రం తగ్గకుండా ‘నో కాంప్రమైజ్’ ధోరణిని ప్రదర్శించారు. తనపై అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతోందన్న వార్తల వేళ, ఆమె నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుదీర్ఘంగా సమావేశమై రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించారు. ఖర్గే భేటీ అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన కొండా సురేఖ.. సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

నా బిడ్డ మాట్లాడితే నాపై చర్యలా?.. కొండా సురేఖ సూటి ప్రశ్న
మహిళలు ఎవరికీ తలవంచకుండా స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ పదేపదే చెబుతుంటారని, అలాంటిది తన కుమార్తె మాట్లాడిన దానికి మంత్రిగా ఉన్న తనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడినందుకే తన కూతురు స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ మొత్తం వ్యవహారం ఏ సందర్భంలో జరిగిందో, ఎందుకు జరిగిందో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు ఇప్పటికే లేఖలు, ఈ-మెయిల్స్ ద్వారా సవివరంగా తెలియజేశానని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి తీరు పార్టీ క్రమశిక్షణ కిందకు రాదా?
అధిష్ఠానాన్ని కాదని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ముందే ప్రకటించడానికి, తదుపరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికనేది తేల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం హక్కు ఉందని ఆమె నిలదీశారు.
పదేళ్లు తానే సీఎం అనడం ఉల్లంఘన కాదా?
“పదేళ్లపాటు నేనే సీఎంగా ఉంటాను” అంటూ రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేయడం పార్టీ క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు రాదా అని నిలదీశారు. తనపై చర్యలు తీసుకోవాలని భావిస్తే.. అంతకంటే ముందు రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని కుండబద్దలు కొట్టారు.

బీసీ వర్గానికేనా చర్యలు? – తాడోపేడోకి సిద్ధం..

బీసీ అయిన తనపైనే చర్యలు తీసుకుంటారా? రేవంత్‌రెడ్డిపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న ఇతర వర్గాలకు (రెడ్డి సామాజిక వర్గానికి) చెందిన నేతలపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తూ.. తనపై అన్యాయంగా వేటు వేస్తే రాష్ట్రంలోని బీసీలంతా ఏకమవుతారని హెచ్చరించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క భార్య కమీషన్ల వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, ఇతర మంత్రులపై ఉన్న తీవ్ర ఆరోపణలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె డిమాండ్ చేశారు.

హైకమాండ్‌కు చెప్పాల్సింది స్పష్టంగా చెప్పానని, వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దామని వ్యాఖ్యానించిన కొండా సురేఖ.. సీఎం రేవంత్‌రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు సంకేతాలిచ్చారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆమె తేల్చిచెప్పడంతో ఇప్పుడు ఏఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *