Terror Attack: కశ్మీర్ లోయలో ప్రశాంతతను దెబ్బతీసేందుకు ఉగ్రమూకలు మరోసారి నీచమైన దాడికి తెగబడ్డాయి. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మెరుపు కాల్పులకు పాల్పడ్డారు. రోటీన్ తనిఖీల్లో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిని టార్గెట్ చేస్తూ బైక్‌పై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ పిరికిపంద దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా తుపాకుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లగా.. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించేలోపే ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు.
బైక్‌పై వచ్చి కాల్పులు.. క్షణాల్లో పరార్..
భద్రతా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం. కుల్గామ్ జిల్లాలోని మీర్ బజార్ సమీపంలో గల అఖ్రాన్ ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం దాదాపు 2:15 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రధాన రహదారిపై ‘నాకా’ (తనిఖీ కేంద్రం) వద్ద సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు.. ఏమాత్రం కనికరం లేకుండా జవాన్లపైకి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు.ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపేలోపే, ముష్కరులు బైక్‌పై వేగంగా తప్పించుకుని పారిపోయారు.
ఆసుపత్రికి తరలింపు – ఇద్దరి పరిస్థితి విషమం..
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను ఇతర సిబ్బంది హుటాహుటిన సమీపంలోని అనంతనాగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాణాపాయం నుంచి వారిని కాపాడేందుకు వైద్య బృందం శ్రమిస్తోంది.
భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..
దాడి జరిగిన వెంటనే అదనపు బలగాలు, ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు అఖ్రాన్, మీర్ బజార్ పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
పారిపోయిన ముష్కరులను పట్టుకునేందుకు భారీ ఎత్తున ‘కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్’ (CASO) ప్రారంభించారు. పరిసర గ్రామాలు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే దారులన్నింటినీ మూసివేసి డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
