Indian Official Killed: జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన అప్రచోదిత కాల్పులు మరోసారి ప్రాణహానికి దారితీశాయి. ఈ ఘటనలో రాజౌరి జిల్లాకు చెందిన అదనపు డెప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ థాపా తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఉన్న ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. అధికార నివాసంపైకి పడిన షెల్ తో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై అధికార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. గాయపడిన సిబ్బందిని సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ విషాదాన్ని తీవ్రంగా సంతాపించుకున్నారు. “ఇది షాక్‌కు గురిచేసే వార్త. అంకితభావంతో సేవలందించే అధికారి కోల్పోవడం బాధాకరం. నిన్ననే ఆయన వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ ఇలా శూన్యం చేసిపోతారని ఊహించలేదు,” అని సీఎం అబ్దుల్లా ఎక్స్ (పాత ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇది కూడా చదవండి: India Pakistan War: మన సైనికులకు మద్ధతిద్దాం..జై హింద్!
ఇకపోతే ఈ కాల్పులు పాక్ దుష్ట చర్యలుగా భారత రక్షణ శాఖ పేర్కొంది. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఇదే సమయంలో సరిహద్దుల్లో ఉగ్రవాద సంస్థలకు పాక్ మద్దతు ఇస్తోందని, డ్రోన్లను ప్రయోగించి లాంచ్ ప్యాడ్లను ఏర్పరుస్తోందని గుర్తించారు. భారత దళాలు ఇటువంటి ప్యాడ్లను ధ్వంసం చేశాయి.
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్న ఈ సమయంలో, పౌర అధికారుల ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందన్న విషయం మరింత స్పష్టమవుతోంది. రాజ్ కుమార్ థాపా మృతి దేశానికి తీరని లోటు.