Jagga reddy: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిస్తుంటే, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం మీడియా సమావేశాలకు పరిమితమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
“అసెంబ్లీ పెట్టాలని కోరేది ప్రతిపక్ష నేతలే.. కానీ ఇక్కడ మాత్రం రివర్స్‌గా జరుగుతోంది. చర్చకు రాకపోతే అసెంబ్లీ ఎందుకు కావాలి?” అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుస్తున్నా, కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్, హరీష్‌రావు లాంటి నాయకులు ‘సెకండ్ బెంచ్ లీడర్స్’ అంటూ విమర్శించిన జగ్గారెడ్డి, “ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు వారికే అభినందనలు తెలుపుతోందేంటి?” అని ఎద్దేవా చేశారు.
“మీరు అక్కడ కోడి పులుసు తినిపిస్తే, వాళ్లు ఇక్కడ చేపల పులుసు తినిపించారు. మధ్యలో తెలంగాణ ప్రజల సంగతి ఏమైంది?” అంటూ వ్యాఖ్యానించారు.
ఇంతకీ మీరు ప్రజా సమస్యలపై చర్చకోసం సిద్ధంగా ఉన్నారా లేక పొలిటికల్ డ్రామా కోసమా అని కూడా ప్రశ్నించారు. సీఎం రేవంత్ విమర్శలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.