Sadhguru

Sadhguru: ‘కోడి మెడ’ను ‘ఏనుగు మెడ’గా మార్చాల్సిన సమయం వచ్చేసింది!

Sadhguru: భారతదేశ భౌగోళిక చిత్రపటాన్ని ఒక్కసారి గమనిస్తే, ఈశాన్య రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంతో కలిపే ఒక ఇరుకైన భూభాగం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాన్నే వ్యూహాత్మకంగా ‘సిలిగురి కారిడార్’ లేదా ప్రాచుర్యంలో ‘చికెన్స్ నెక్’ (కోడి మెడ) అని పిలుస్తారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సున్నితమైన ప్రాంతంపై ఇటీవల బంగ్లాదేశ్ మధ్యంతర నాయకత్వం నుంచి వస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు చేసిన విశ్లేషణ ఇప్పుడు రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ముహమ్మద్ యూనస్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్ర?

బంగ్లాదేశ్ నేత ముహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలను సద్గురు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ మాత్రమే ఆ ప్రాంతానికి సముద్ర ద్వారమని యూనస్ చేసిన కామెంట్స్ వెనుక లోతైన భౌగోళిక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శత్రు దేశాలు మన దేశ సార్వభౌమాధికారాన్ని నేరుగా సవాలు చేసే వరకు వేచి చూడటం తెలివైన పని కాదని, పొరుగు దేశాల నుంచి వస్తున్న హెచ్చరికల పట్ల భారత్ తక్షణమే అప్రమత్తం కావాలని సద్గురు హెచ్చరించారు.

చారిత్రక తప్పిదాలు – చేజారిన అవకాశాలు

భారతదేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక లోపాలను సద్గురు ఈ సందర్భంగా ఎత్తి చూపారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న దారిపై ఆధారపడి ఒక దేశాన్ని నిర్మించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Harish Rao: అసెంబ్లీలో ‘నీళ్ల’ పోరు.. ఉత్తమ్ వర్సెస్ హరీష్.. ‘పీపీటీ’కి ఛాన్స్ ఇస్తారా?

1947లో మనకు పరిస్థితులు అనుకూలించకపోయినా.. 1972లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో ఈ భౌగోళిక లోపాన్ని సరిదిద్దే అధికారం, అవకాశం భారత్‌కు ఉంది. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు ఆ అవకాశం చేజార్చుకున్నాం అని ఆయన పేర్కొన్నారు.

రక్షణ వ్యూహాల్లో రావాల్సిన మార్పు

ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇరుకైన ‘కోడి మెడ’ను రక్షణ పరంగా అత్యంత పటిష్టమైన ‘ఏనుగు మెడ’ గా మార్చాల్సిన అవసరం ఉందని సద్గురు స్పష్టం చేశారు. దేశం అంటే కేవలం గొప్ప ఆశయాలతో నడవదని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచమంతా సరిహద్దులు లేని ఒకే కుటుంబం (వసుధైవ కుటుంబం) కావాలనేది ఉన్నతమైన ఆశయమే అయినప్పటికీ, నేటి ప్రపంచంలో దేశ రక్షణే ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. యూరప్ దేశాలు సుదీర్ఘ యుద్ధాల తర్వాత ఎలాగైతే ఐక్యంగా మారాయో, భవిష్యత్తులో ఆసియాలోనూ అలాంటి పరిస్థితి రావొచ్చని, కానీ అప్పటివరకు మన రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకోవడం అనివార్యమని ఆయన తన విశ్లేషణను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *