New Year 2026

New Year 2026: సైబరాబాద్‌ పోలీసుల సీరియస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు!

New Year 2026: కొత్త ఏడాది వేడుకల కోసం సిద్ధమవుతున్న నగర వాసులకు సైబరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. 2026 నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని పోలీసులు పక్కా వ్యూహంతో సిద్ధమయ్యారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ముఖ్యంగా ఆ రాత్రి 8 గంటల నుంచే నగరం అంతటా 100కు పైగా ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టనున్నారు.

ఈసారి క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు గట్టి నిబంధనలు పెట్టారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, వాహన పత్రాలన్నీ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. చాలామంది డ్రైవర్లు రైడ్లు క్యాన్సిల్ చేస్తుంటారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ప్రయాణికులు కోరినప్పుడు రైడ్ నిరాకరిస్తే ఈ-చలాన్ ద్వారా రూ. 500 జరిమానా వేస్తారు. అలాగే, పండగ కదా అని ప్రయాణికుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం తాగి వాహనం నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఏకంగా రూ. 10,000 జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. వాహనాన్ని కూడా అక్కడికక్కడే సీజ్ చేస్తారు. పదే పదే తప్పు చేస్తే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా ఆర్టీఓకు సిఫార్సు చేస్తారు. ఇక పబ్‌లు, బార్ల నిర్వాహకులు కూడా బాధ్యత తీసుకోవాలని, మద్యం తాగిన కస్టమర్ల కోసం డ్రైవర్లను లేదా క్యాబ్‌లను ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించారు. అలా చేయని యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తారు.

యువత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, రాష్ డ్రైవింగ్ చేస్తే డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి చలాన్లు వేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతారు. వాహనాల్లో భారీ శబ్దంతో మ్యూజిక్ పెట్టడం కూడా నిషేధించారు. వేడుకలను ఎంజాయ్ చేయండి కానీ, మద్యం తాగినప్పుడు సొంతంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ సేవలను వాడుకోవాలని పోలీసులు సూచించారు. ప్రశాంతంగా కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *