Harish Rao

Harish Rao: అసెంబ్లీలో ‘నీళ్ల’ పోరు.. ఉత్తమ్ వర్సెస్ హరీష్.. ‘పీపీటీ’కి ఛాన్స్ ఇస్తారా?

Harish Rao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సాగునీటి ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. అసెంబ్లీ నిర్వహణపై జరిగిన బీఏసీ (Business Advisory Committee) సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా నదీ జలాల అంశంపై సభలో తాము కూడా పీపీటీ (PPT) ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

15 రోజులు కావాలి.. ఎజెండా ఏది?

సభా నిర్వహణ తీరుపై హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము పట్టుబట్టామని, అయితే కేవలం వారం రోజులు మాత్రమే సభ జరుపుతామని స్పీకర్ చెప్పారని ఆయన వెల్లడించారు. సభ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఎజెండా ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన ఆయన, ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటి వరకు హౌస్ కమిటీలు, లెజిస్లేటివ్ కమిటీలు వేయకపోవడంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు.

ఇది కూడా చదవండి: Bandi sanjay: కాలేజీ విద్యార్థులు బెట్టింగ్‌లు వేసుకుని బాలకృష్ణ సినిమాలు చూస్తున్నారు

ఉత్తమ్‌కు ‘రేవంత్’ సవాసం పట్టుకుంది!

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాసం పట్టుకుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆయన ఆరోపించారు. జీవో ప్రకారం 90 టీఎంసీల వాటా ఉండగా, దాన్ని 45 టీఎంసీలకు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి క్లియరెన్స్ తెచ్చామని, కానీ కాంగ్రెస్ పాలనలో మూడు డీపీఆర్‌లు (DPR) వెనక్కి వచ్చినా మంత్రి మౌనంగా ఉండటం ఏంటని నిలదీశారు.

సవాల్‌కు సిద్ధం.. ఎస్ఎల్బీసీపై లెక్కలివే!

ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ. 1900 కోట్లు ఖర్చు పెట్టిందని, రెండు టీఎంసీల తరలింపు కోసం రెండు టన్నెళ్లను తామే తవ్వించామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లు పేర్కొన్నారు. కోడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రెండేళ్ల క్రితమే కొబ్బరికాయ కొట్టినా, ఇప్పటి వరకు డీపీఆర్ ఎందుకు పంపలేదో చెప్పాలన్నారు. అసెంబ్లీలో 15 కీలక అంశాలపై చర్చకు తాము పట్టుబట్టామని, ప్రభుత్వం చర్చకు వెనకడుగు వేయొద్దని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *